Congress | ప్రియాంక.. నెహ్రూ పక్కనున్న హస్తం చోటా నేతను, మనం ఎక్కడున్నాం?… అని అడిగింది. ‘మేడం… మనం తెలంగాణలోని హుస్నాబాద్‌లో ఉన్నాం. కరీంనగర్ జిల్లా అంటే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టిన గడ్డ. దేశంలోని బంగారాన్ని బ్రిటన్ లో తాకట్టుపెట్టి బతుకుతున్న రోజుల్లో ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని కాపాడిన తెలంగాణ బిడ్డ అంటూ ఇంకా చెప్పబోతుంటే… ప్రియాంక ముఖం చిట్లించుకొని, ‘ఆ పేరంటే మాకు చిరాకు… ఆపవయ్యా సోది’ ‘ఆ విషయం తెలుసు మేడం… కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. కరీంనగర్లో ప్రచారం చేస్తూ ఆయన పేరు చెప్పకపోతే బాగోదు…’ అన్నాడు ఇబ్బందిగా.
‘సరే… సరే… చెబుతాను. తెలంగాణ ప్రభుత్వం పీవీలాంటి అపర మేధావిని పట్టించుకోలేదు. చిన్నచూపు చూసింది. తెలంగాణ మహనీయుల మీద ఇదేనా గౌరవం అని నిలదీస్తాను.’ ‘వద్దు మేడం… పీవీని మనం మరచిపోతే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం పీవీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. పీవీ కుటుంబాన్ని మనం మరచి పోతే కేసీఆర్ మాత్రం ఆయన కుమార్తెను ఎమ్మెల్సీని చేసి గౌరవించారు. ‘మరేం చెప్పమంటావ్? నిజానికి పీవీ పేరు ఎత్తితేనే మా ఇంట్లో అందరికీ చిరాకు… అలాంటి వారి గురించి ఇక ఏం మాట్లాడాలి?’ ‘అదేదో పాల ప్రకటనలో చెప్పినట్టు, మాకు పీవీ అంటే చాలా ఇష్టం. పొద్దున లేవగానే పీవీని తలుచుకుంటాం అని చెప్పండి. ఎన్నికలు, అదీ పీవీ సొంత రాష్ట్రమైన తెలంగాణలో, మనసుకు కష్టమైనా తలచుకోవాలి మేడం. ‘సర్లే ఏడవకు. ఏదో ఒక మీటింగ్‌లో చెబుతాలే …’
‘కరీంనగర్ గడ్డపై నిలబడి మాట్లాడుతున్నందుకు సంతోషంతో ఒళ్లు పులకిస్తున్నది. ఈ జిల్లా బిడ్డ పీవీ నరసింహా రావు అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టం…’ అంటూ ప్రియాంక నెహ్రూ ఉపన్యసిస్తుంటే, స్టేజీ పైన వెనుక నుంచి చిన్నగా నవ్వులు వినిపించాయి. ఉపన్యాసం ముగించి గెస్ట్ హౌస్‌కు వచ్చిన ప్రియాంక నెహ్రూ పార్టీ లీడర్లతో ‘మీరంతా నేను మాట్లాడుతుంటే నవ్వారు ఎందుకు?…’ అని అడిగింది. ‘పీవీ మరణించినప్పుడు మృతదేహాన్ని ఢిల్లీలో పార్టీ ఆఫీస్‌కు తీసుకువస్తే లోనికి రానివ్వలేదు. గంట సేపు బయటే వేచి ఉండేలా చేశారు. అప్పటి సీఎం వైయస్ఆర్ కు ఫోన్‌చేసి ఎలాగైనా వెంటనే హైదరాబాద్ తీసుకువెళ్లమని ఒత్తిడి తెచ్చారు.
అటు నుంచి అటే హైదరాబాద్ పంపించారు కూడా. ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించకుండా ఉండేందుకు ఆ రోజు చేసిన హడావుడి గుర్తుకు వచ్చింది. చివరకు హైదరాబాద్‌లో కూడా సక్రమంగా దహన సంస్కారాలు జరపలేదు. పీవీ కుటుంబ సభ్యులను పిలిచి హైదరాబాద్ తీసుకువెళ్లండి అని ఒత్తిడి తెచ్చారు. మీరేమో పీవీ అంటే మా కుటుంబానికి ఎంతో ప్రేమ అని ఏ మాత్రం మొహమాటం లేకుండా ప్రసంగిస్తుంటే నవ్వు ఆగలేదు.’ ‘చూడండి లీడర్స్… రాజకీయం అంటే సినిమా వాళ్ల కన్నా ఎక్కువ నటించాలి తప్పదు. నేనూ అదే చేశా’ ‘కానీ, జనం కూడా మన హస్తం మీద ప్రేమ నటిస్తున్నారేమో అనిపిస్తుంది’.