హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పేపర్ లీకేజీలో నిందితుల మరోకోణం బయటపడింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి పక్కా ప్లాన్‌తో పేపర్ లీక్ అయినట్టు సుధీర్ఘ దర్యాప్తులో వెల్లడైంది. ప్రవీణ్ పోలీస్ అధికారి కావాలన్న కలే గ్రూప్-1 పేపర్ లీకేజీకి పురిగొల్పిందని తేలింది. ఆయన తండ్రి అదనపు డీఎస్పీ కావడంతో డీఎస్సీ కావాలని అనుకున్నాడు. జైళ్ల శాఖలోనైనా ఉద్యోగం వస్తుందని భావించాడు. దీంతో సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డితో కొన్నాళ్లు స్నేహంగా ఉంటూ తన ఆలోచనను పంచుకున్నాడు. రాజశేఖర్‌రెడ్డి కూడా అతని ఆలోచనతో తనకు కావాల్సిన వారికి కూడా పేపర్ అందించవచ్చని భావించాడు. దీంతో ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్‌తో గ్రూప్-1 పేపర్ లీక్ చేసినట్టు దర్యాప్తులో తేలింది.
8 వేల మంది ఆన్సర్ షీట్స్ రిజెక్ట్
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష ఓఎంఆర్ షీట్‌పై నిందితుడైన ప్రవీణ్ బుక్లెట్ నెంబర్ తప్పుగా బబ్లింగ్ చేయడంతో సమాధానపత్రం తిరస్కరణకు గురయ్యింది. ఇలా గ్రూప్-1 పరీక్షలో 8 వేల మంది బబ్లింగ్ తప్పుగా చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. వారిలో చాలామంది టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చి అధికారులకు తమ గోడు వెల్లబోసుకున్నారు. వారిలో కొందరితో ప్రవీణ్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఇలా అధికారులకు తమ గోడును వెల్లబోసుకోవాలని ప్లాన్ చేశాడు. ఇలా వచ్చిన వారిలోనే ఖమ్మం జిల్లాకు చెందిన సాయిలౌకిక్, సుష్మిత దంపతులు ఉన్నారు. వారితో స్నేహం పెంచుకున్న ప్రవీణ్.. డీఏవో (డిస్ట్రిక్ట్ అకౌంట్స్ అఫీసర్) ప్రశ్నపత్రం తమ వద్ద ఉన్నదంటూ వారితో రూ.10 లక్షలకు బేరం పెట్టాడు. అందులో నుంచి రూ.6 లక్షలు ప్రవీణ్ తీసుకున్నాడు. అయితే ప్రవీణ్ ఈ విషయాన్ని విచారణలో వెల్లడించలేదు. సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది.
ప్రధాన నిందితుల కస్టడీ కోరిన ఈడీ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితులు ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నాంపల్లి కోర్టులో వేసిన పిటిషన్‌పై బుధవారం వాదనలు జరిగాయి. ఈడీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జగన్మోహన్ వాదనలు విన్పించారు. వాదనలు విన్న అనంతరం 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వీ ఈశ్వరయ్య తీర్పును వాయిదా వేశారు. ఇదే కేసులో ఏ3 రేణుకా రాథోడ్, ఏ4 డాక్యానాయక్, ఏ5 కేతావత్ రాజేశ్వర్ బెయిల్‌పై కోర్టులో వాదనలు జరిగాయి, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును గురువారానికి వాయిదా వేసింది.