హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : ‘డాక్టరేట్ లేని వ్యక్తిని స్కిల్ ఇండియా యూనివర్సిటీ వీసీగా నియమించారు. మేం పీహెచ్డీ హోల్డర్లం, ఎంటెక్ పట్టభద్రులం. మేమంతా డాక్టరేట్ లేని వ్యక్తి కింద పనిచేయాల్నా?’ అంటూ పాలిటెక్నిక్ జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది తమను అవమానించడమే అవుతుందని అంటున్నారు. ఇలాంటి విధానంలో తాము అస్సలు పనిచేయలేమని చెప్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 30-40 శాతం డాక్టరేట్లున్న అధ్యాపకులు, ఎంటెక్ పూర్తిచేసినవారు పనిచేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీకే దిక్కూదివాణం లేదు. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. డిపార్ట్మెంట్లు లేవు. ఇలాంటి వర్సిటీ కింద ఎలా పనిచేయాలని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేయాలన్న సర్కార్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాలిటెక్నిక్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. పాలిటెక్నిక్ అధ్యాపకులు, సిబ్బంది అంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్న భోజన సమయంలో కాలేజీల్లో నిరసనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో తాము నిర్వహించిన ఆందోళనలు విజయవంతమైనట్టు జేఏసీ నేతలు తెలిపారు. ఇదే విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేసినట్టు చెప్పారు.
ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్లు, అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించామని అన్నారు. రాబోయే వారం రోజులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతామని జేఏసీ నేతలు వెల్లడించారు. పాలిటెక్నిక్ కాలేజీల విలీనాన్ని విద్యార్థి సంఘాలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జీవో-97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్‌పూర్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్కిల్ యూనివర్సిటీ వద్దు.. పాలిటెక్నిక్ విద్యయే ముద్దు అంటూ గజ్వేల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు రోడ్డెక్కారు. కేసముద్రం, షాద్‌నగర్, జోగిపేట, పరకాల, కరీంనగర్, నిర్మల్, సంగారెడ్డి, మాసాబ్‌ట్యాంక్, కొత్తగూడెం, బెల్లంపల్లిల్లో విద్యార్థులు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నది. డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. సర్కార్ బడుల్లో అడ్మిషన్లు గణనీయంగా తగ్గాయి. అంతోఇంతో అడ్మిషన్లు ఉన్నది పాలిటెక్నిక్ కాలేజీల్లోనే. రాష్ట్రంలో 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 19,074 సీట్లుంటే ఈ ఏడాది 18,120 (95శాతం) సీట్లు నిండాయి. ఇలాంటి కాలేజీలను, ఘనమైన చరిత్ర గల విద్యాసంస్థలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోని స్కిల్ యూనివర్సిటీలో అంతర్భాగం చేస్తే కాలేజీలు నిర్వీర్యమవుతాయని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిట్టర్, ప్లంబర్, ఎలక్ట్రిషియన్ ఉద్యోగాల కల్పనను పెంచాలంటే ఐటీఐలను బలోపేతం చేయాలని, పాలిటెక్నిక్ కాలేజీలను ముట్టుకోవద్దని జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు.