హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : విశాఖ ఫిషింగ్ హర్బర్ బోట్ల అగ్ని ప్రమాదం కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో వాసుపల్లి నాని, అతడి మామ సత్యంను అరెస్ట్ చేసినట్టు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. వాసుపల్లి నానితో పాటు అతడి మామ సత్యం ప్రమాదానికి అసలు కారణమని తేల్చారు. వాసుపల్లి నాని అక్కడ కుక్ కాగా.. సత్యం వాచ్‌మన్‌గా పనిచేస్తుంటారని పేర్కొన్నారు.
ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు వీరిద్దరూ అల్లిపల్లి వెంకటేశ్‌కు చెందిన 887 నంబర్ బోటులో మద్యం తాగి చేప ఫ్రై చేసుకుని పార్టీ చేసుకొన్నారని తెలిపారు. అనంతరం సిగిరెట్ తాగి పక్కన ఉన్న 815 బోటుపై పడేసినట్టు సీపీ తెలిపారు. దీంతో వలకు ఉన్న నైలాన్ తాడుకు అంటుకొన్న మంటలు మిగిలిన అన్ని బోట్లకు వ్యాపించి కాలిపోయాయని వివరించారు. ఇది గమనించిన వీరు అక్కడి నుంచి జారుకున్నారని తెలిపారు. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 437,438,285 ప్రకారం కేసు నమోదు చేశామని సీపీ తెలిపారు.