హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : ఎన్‌హెచ్-44పై బోయిన్పల్లి-కాళ్లకాల్, తొండుపల్లి-కొత్తూరు వరకు ఆరు లేన్ల విస్తరణలో భాగంగా మిగిలిన పనులకు సంబంధించి బిడ్లు ఆహ్వానిస్తున్నట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తెలిపింది. ఈ మేరకు గురువారం సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పనుల్లో పాత కాంట్రాక్టులను రద్దుచేసిన క్రమంలో కొత్తగా టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నది. కాంట్రాక్టర్లు నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
కాళ్లకాల్-గుండ్లపోచంపల్లి మార్గంలో 17కి.మీ, గుండ్లపోచంపల్లి-బోయిన్పల్లి మార్గంలో 10.31 కి.మీ, తొండుపల్లి-కొత్తూరు మార్గంలో 11.8 కి.మీ. మార్గాల్లో మిగిలిన సుమారు 21 కి.మీ. విస్తరణ పనులకు కొత్త కాంట్రాక్టర్లు బిడ్లు వేసేందుకు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించింది. బోయినపల్లి-కల్లకల్ మార్గంలో నాలుగు ఫ్లై ఓవర్లు, ఐదు అండర్‌పాస్‌లు, ఒక ఆర్వోబీ ఉన్నట్టు తెలిపింది. తొండుపల్లి-కొత్తూరు ఆరు లేన్ల విస్తరణ పనుల్లో భాగంగా ఎనిమిది అండర్‌పాస్‌ల నిర్మాణాలు ఉన్నట్టు వివరించింది. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు పనులు ప్రారంభమైన తేదీ నుంచి 18 నెలలకాల పరిమితిని నిర్దేశించినట్టు తెలిపింది.