హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): పెద్ద సంఖ్యలో పోలీస్ కొలువులకు నోటిఫికేషన్ రాబోతుండటంతో యువతలో జోష్ కనిపిస్తున్నది. ఇప్పటికే చాలామంది ఉద్యోగార్థులు మైదానాల్లో ‘కసరత్తులు’ ప్రారంభించారు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, జిల్లా కేంద్రాల్లోని మైదానాలన్నీ క్రమంగా రద్దీగా మారుతున్నాయి. త్వరలోనే హోంశాఖలో 18 ,334 ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇటీవల ప్రకటించడం యువతలో ఉత్సాహం నింపింది. నోటిఫికేషన్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉండటంతో ఉ ద్యోగార్థులు ప్రిపరేషన్ మొదలు పెట్టారు. సమయాన్ని వృ థా చేయకుండా ప్రణాళికలు వేసుకొని, అమలుచేస్తున్నా రు. కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగార్థులు కోచింగుల్లో చేరుతున్నారు. దీంతో కోచింగ్ సెంటర్ల వద్ద సందడి నెలకొన్నది.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, మధ్యతరగతి యువతకు పోలీస్ ఉద్యోగాల్లో చేరాలని ఉన్నా కోచింగ్, పుస్తకాల కొనుగోలు తదితర వాటికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకులుగా మారేవి. ఇప్పుడు ఉచిత శిక్షణ శిబిరాలు అలాంటి వారి పాలిట వరంగా మారుతున్నాయి. గతంలో అక్కడక్కడ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఫిజికల్ ఈవెంట్స్‌తోపాటు రాత పరీక్షకు కోచింగ్ ఇచ్చేవారు. ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు ముందుకు వచ్చేవారు. క్రమేణా అది ప్రతి జిల్లాలోనూ ఉచిత శిబిరాలు ఏర్పాటు చేసే సంప్రదాయానికి దారితీసింది. ఇప్పుడు స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనూ ఉచిత కోచింగ్ సెంటర్లు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే అంశంపై మంత్రి కేటీఆర్ ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ, టీశాట్ ద్వారా ఉచితంగా పోటీ పరీక్షలకు కోచింగ్ క్లాస్‌లు నిర్వహిస్తున్నామని, స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని ఉచిత కోచింగ్ ఇచ్చే అంశంలో ముందుకు రావాలని పిలుపునివ్వడం సానుకూల సందేశాన్ని ఇచ్చినట్టయ్యింది. సిద్దిపేట జిల్లా పరిధిలో పోలీస్ ఉద్యోగాలకు సీఎం కేసీఆర్ పేరిట ఉచిత కోచింగ్ ఇవ్వాలని యోచిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో వెల్లడించారు.
నేను 2020లో ఎల్ఎల్బీ పూర్తి చేశాను. ఎస్సై ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం పెట్టుకొని ప్రయత్నిస్తున్నా. త్వరలో నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టా ను. ఒక వైపు ఫిజికల్ ఈవెంట్స్, మరోవైపు రాతపరీక్షకు సన్నద్ధం అవుతున్నా. రెండింటికి సమయా న్ని విభజించుకొని ప్రిపేర్ అవుతున్నా. జాబ్ సాధిస్తానన్న నమ్మకం ఉన్నది. – మౌనిక, కరీంనగర్
మాది సూర్యాపేట జిల్లా. నేను 2021లో ఎమ్మెస్సీ ఐప్లెడ్ మ్యాథ్స్ పూర్తి చేశాను. నాన్నే నాకు ప్రేరణ. ఆయన ఎంతో కష్టపడి నన్ను ఎమ్మెస్సీ చదివించారు. నన్ను పోలీస్ యూనిఫాంలో చూడాలన్నది నాన్న కోరిక. అది నెరవేర్చాలన్న లక్ష్యంతో ప్రయత్నిస్తున్నా. పెద్ద సంఖ్యలో పోస్టులు రాబోతున్నాయి. ఎలాగైనా ఈ రిక్రూట్మెంట్లో ఎస్సై ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాను. రోజూ రెండున్నర గంటల ఫిజికల్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. రోజుకు ఎనిమిది గంటలు ప్రిపరేషన్ చేస్తున్నా. ఆన్లైన్లో కోచింగ్ అటెండ్ అవుతూనే నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుతున్నా. – సంధ్య, సూర్యాపేట
పోలీస్ ఉద్యోగంలో అయితే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉంటుంది. నేను క్రికెటర్‌ను. డిగ్రీ పూర్తి చేశాను. ఎస్సై, కానిస్టేబుల్ రెండు పోస్టులకు ప్రిపేరవుతున్నా. ఏదైనా సరే పోలీస్ జాబ్ సాధించడమే నా లక్ష్యం. నేను సొంతంగానే ప్రిపేరవుతున్నా.
– మహమ్మద్ తయాబ్, హైదరాబాద్
నాకు యూనిఫాం సర్వీస్ అంటే చాలా ఇష్టం. ఆర్మీలో చేరేందుకు ఈవెంట్స్‌లో పాల్గొన్నా. రన్నింగ్‌లో 0.5 సెకన్ల తేడాతో పోయింది. ఈసారి మిస్ కావొద్దని ముందు నుంచే ప్రయత్నిస్తున్నాను. ఎస్సై, కానిస్టేబుల్ రెండింటికీ ప్రిపేరవుతున్నా. ఇప్పటికే గ్రౌండ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. నాది బీకామ్. ఇప్పటికైతే సొంతంగానే ప్రిపేరవుతున్నా.
– పవన్‌కల్యాణ్, చర్లపల్లి, హైదరాబాద్