గురివింద గింజ తన నలుపు ఎరుగదట. ఇవాళ సింధియా వ్యవహారం అలాగే ఉన్నది. తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టగానే రాష్ట్ర బీజేపీ నేతలు ఆయన్ను ఆవహించేశారు. అంతే.. ఆయనకు ఎక్కడ చూసినా పరిపాలన సక్రమంగా జరగట్లేదనిపించింది. ఇక్కడ పరిపాలన ఎలా జరుగుతున్నదనేది ఇక్కడి ప్రజలకు బాగా బాగా తెలుసు.. తెలంగాణను నిందించడానికి ముందు.. తాను తన తండ్రి మాధవరావు సింధియా దాదాపు 5 దశాబ్దాలు ప్రాతినిధ్యం వహించిన మధ్యప్రదేశ్‌లో కానీ.. కనీసం తాము మొన్నటిదాకా ప్రాతినిధ్యం వహించిన గుణ నియోజకవర్గంలో కానీ ప్రగతి ఎలా ఉన్నదో ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది.
హైదరాబాద్, జూలై 30, (నమస్తే తెలంగాణ):బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు తెలంగాణ గడ్డ మీద అడుపెడితే చాలు ఎక్కడలేని సుద్దపూసల్లా మాట్లాడుతున్నారు. పీకలదాక ఆరోపణల్లో మునిగినప్పటికీ ప్రవచనాలు వల్లెవేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల పరిస్థితి ఇంట్లో ఈగల మోత…బయట పల్లకిమోతలా మారిన విషయం తెలియనిది కాదు. తాజాగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంపై చేసిన విమర్శలను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లే తిప్పికొట్టారు. ‘మధ్యప్రదేశ్‌లో మీ పాలన ఎంత సొక్కంగా ఉన్నదో తెలియదా? అని నెటిజన్లు కడిగిపారేశారు. మొన్నటిదాకా మీ కుటుంబమే అధికారాన్ని వెలగబెట్టిన గుణ నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం మచ్చుకు కూడా కానరావట్లేదని ఎద్దేవా చేశారు. ఇదే జ్యోతిరాదిత్య సింధియా గత ఏడాది సెప్టెంబర్ 11న తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా తెలంగాణలో అభివృద్ధి దినదినానికి ప్రవర్ధమానం అవుతున్నదని వేనోళ్ల పొగిడిపోయారు. టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని ప్రశంసలు కురిపించారు. కేంద్రంలో మోదీ సర్కారు నిర్వాకాన్ని సీఎం కేసీఆర్ ఎండగట్టకముందు వరకు బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు.. తెలంగాణను రోల్ మాడల్ స్టేట్‌గా వేనోళ్ల కొనియాడిన వాళ్లే. మధ్యప్రదేశ్‌లో బీజేపీ పాలన ఎంత సక్కగా ఉన్నదో గురువారం నెటిజన్లు ఉదాహరణలతో సహా ఎండగట్టారు. వాటిలో మచ్చుకు కొన్ని..
మధ్యప్రదేశ్‌లో బీజేపీ సర్కార్ అవినీతిలో పీకలదాక మునిగిన సంగతి మరచి సింధియా, దొంగే.. దొంగా.. దొంగా అని అరచినట్టుగా తెలంగాణను నిందించడం విడ్డూరంగా ఉన్నదని నెటిజన్లు విస్మయం ప్రకటించారు. ఎంపీ సర్కారు నిర్వహించిన టీచర్స్ ఎలిజబుల్టీ టెస్ట్-2002లో ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంలో స్వయానా ఆ రాష్ట్ర పోలీసులే ఢిల్లీలో డాక్టర్ ఆనంద్రాయ్ని అరెస్టు చేసిన సంగతి.. సింధియా మరిచిపోయారా? అని నెటిజన్లు నిలదీశారు.
భోపాల్‌లో గతవారం జ్యోతిరాదిత్య సొంత కార్యాలయంలోకే వరద నీరు వచ్చింది. ఈ వీడియో క్లిపింగ్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లు జత చేస్తూ, ‘తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీ ఇల్లు చక్కబెట్టుకో’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ముందు నీ పని చక్కగా చేసి ఇతరుల గురించి మాట్లాడితే బాగుంటుంద’ని నెటిజన్లు హితవు పలికారు. మధ్యప్రదేశ్‌లో రూ.529 కోట్ల వ్యయంతో నిర్మించిన రోడ్డు ఏడాది తిరక్కముందే ఎంతటి దుస్థితికి గురైందో వార్తా క్లిపింగ్‌ను టీఆర్ఎస్ నేత క్రిశాంక్ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లోని రోడ్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదని నెటిజన్లు ప్రశ్నించారు. గుంతలతో నిండిన ఓ రోడ్డు ఫొటోను షేర్ చేసిన ఓ నెటిజన్.. ‘తెలంగాణ వరదలపై మాట్లాడుతున్న జ్యోతిరాదిత్య.. మధ్యప్రదేశ్ రోడ్లపై తయారైన చంద్రబింబాలను మాత్రం దాచకూడదు. ముందు మీ దగ్గర బాగుచేసి, వేరొకరిపై వేలెత్తి చూపాలి’ అని చురక అంటించారు. ‘మీరు గుణ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. అక్కడ రౌడీలు రాంప్యారీ అనే మహిళపై డీజిల్ పోసి తగులబెట్టారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని వేల మంది ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. మీరెందుకు గప్‌చుప్‌గా ఉన్నారు?’ అని మరో నెటిజన్ సింధియాపై మండిపడ్డారు. ఎంపీలోని ప్రభుత్వ పాఠశాలలో పైనుంచి వర్షపు నీరు పడుతుంటే విద్యార్థులు గొడుగు పట్టుకొని కూర్చున్న వీడియోలు, ఫొటోలు ఇటీవల వైరలయ్యాయి. ఆ ఫొటోను, అదే సమయంలో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కట్టించిన అత్యాధునిక ప్రభుత్వ పాఠశాల భవనం ఫొటోను కలిపి షేర్ చేసిన ఓ నెటిజన్.. ‘జ్యోతిరాదిత్య నువ్వు ఇంకా ప్రవచనాలు చెప్తావా?’ అని ఎద్దేవా చేశారు.
‘టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందువరసలో ఉన్నది. సామాన్యుడి అభివృద్ధికి తోడ్పడే టెక్కీలే నిజమైన హీరోలు. డ్రోన్ టెక్నాలజీ ఓ సంచలనం. తెలంగాణ రాష్ట్రం అర్థిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నది’
పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిరుడు సెప్టెంబర్ 11న హైదరాబాద్‌కు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆతిథ్యాన్ని స్వీకరించి.. వికారాబాద్‌లో మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రారంభించినప్పడు ఉబ్బి తబ్బిబ్బై మాట్లాడిన మాటలివి.
పట్టుమని పది నెలలైనా కాలేదు.. సింథియాకు రాష్ట్రంలో ఎక్కడలేని తిరోగమనం కనిపించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కావడం లేదట. రాష్ట్రం సక్రమంగా పరిపాలన సాగటం లేదట. తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన సింధియాకు ఉన్నట్టుండి కలిగిన జ్ఞానోదయమిది.