తమ కుమార్తెల చదువు, పెండ్లి వంటి భవిష్యత్తు ఖర్చుల కోసం తల్లిదండ్రులకు బాసటగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై). అయితే అందరికీ ఈ ఖాతాను తెరిచేందుకు వీల్లేదు. పిల్లల వయసు, ఖాతా నిర్వహణదారు నివాస హోదాకు సంబంధించి కొన్ని నిర్ధిష్ట నిబంధనలున్నాయి మరి.
ఎన్నారైల విషయంలో..
ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భారత్లో ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), మ్యూచువల్ ఫండ్స్ తదితర వేదికల్లో పెట్టుబడుల్ని పెట్టుకోవచ్చు. అయినప్పటికీ ప్రతీ పథకానికి వారు అర్హులు కాదు. కొన్ని పెట్టుబడుల అర్హతకు సంబంధించి నిర్ధిష్ట షరతులుంటాయి. అవి ఎన్నారైల భాగస్వామ్యాన్ని అనుమతించవు. భారతీయ తపాలా శాఖ (ఇండియా పోస్ట్) వెబ్సైట్ వివరాల ప్రకారం.. ఎస్ఎస్వైలో దేశంలో నివసిస్తున్న పౌరులకే పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉన్నది. కాబట్టి ఎన్నారైలు ఎస్ఎస్వై ఖాతాను తెరువలేరు.
ఇదీ సంగతి..
ఒకసారి ఎస్ఎస్వై ఖాతాను తెరిస్తే.. తొలి 15 ఏండ్లపాటు డిపాజిట్లుంటాయి. అయితే అమ్మాయి వయసు 21 ఏండ్లదాకే ఖాతా యాక్టివ్గా ఉంటుంది. ఆ తర్వాత పెట్టుబడులు ఆగినా.. దానిపై వడ్డీ ఆదాయం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అమ్మాయికి 18 ఏండ్లు నిండితే తన ఉన్నత చదువుల నిమిత్తం పాక్షిక ఉపసంహరణలకు వీలుంటుంది. 21 ఏండ్లు దాటితే పూర్తిగా తీసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250, గరిష్ఠంగా రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ వడ్డీరేటును ప్రతీ మూడు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుత వార్షిక వడ్డీరేటు 8.2 శాతం. మెచ్యూరిటీ తీరిన పథకాల్లో మదుపర్లకు ఒకేసారి లేదా ఐదేండ్లపాటు వార్షిక వాయిదా పద్ధతుల్లో నగదు ఉపసంహరణలకు వీలుంటుంది.