హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : నర్సరీ.. ఎల్కేజీ.. యూకేజీ. ప్రతి చిన్నారి ఈ తరగతులు చదవాల్సిందే. అయితే ఈ కోర్సులను బోధించేందుకు శిక్షణపొందిన టీచర్లు అందుబాటులో ఉండటం లేదు. ఇలాంటి వారి కోసం తాజాగా నేషనల్ స్కిల్ డెవలప్మెంటల్ కౌన్సిల్ ఓ కొత్త కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీ ప్రైమరీ టీచర్ల శిక్షణ కోసమే ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ ఆన్లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 గంటల వ్యవధి గల ఆన్లైన్ కోర్సును నిర్వహిస్తున్నది.
నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ లెవల్-4 కోర్సును పూర్తి చేయవచ్చని ప్రైవేట్ స్కూల్స్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అసోసియేషన్ (పీఎస్ఏసీడబ్ల్యూఏ) జాతీయ అధ్యక్షుడు షామిల్ అహ్మద్ వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ కోర్సు ప్రత్యేకతలను వివరించారు. ఈ కోర్సు పూర్తిచేయడం ద్వారా 16 క్రెడిట్లు సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, కోశాధికారి కే శ్రీకాంత్‌రెడ్డి, సీ రామచంద్రారెడ్డి, కందాల పాపిరెడ్డి, అనంతరెడ్డి పాల్గొన్నారు.