సిద్దిపేట, డిసెంబర్ 26: బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో బలోపేతం చేసేందుకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అక్కడి పారిశ్రామికవేత్తలు పేర్కొన్నారు. సోమవారం నాందేడ్ జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలు గోపాల్ గోరంటాల్, మహేంద్ర సిద్ధార్థ, బోగ శ్రీనివాస్, మేర్గు విజయ్, దినేశ్ రాంభివాల్ తదితరులు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావును కలిశారు. బీఆర్ఎస్లో పనిచేసేందుకు తమకు అవకాశం కల్పించాలని కోరారు. నాందేడ్ జిల్లాలో లక్షకు పైగా తెలుగు ప్రజలు ఉన్నారని, అందులో ఎక్కువగా తెలంగాణ ప్రజలు ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ బూర మల్లేశం, జనరల్ సెక్రటరీ పురుషోత్తం, నంగునూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగు పురేందర్ పాల్గొన్నారు.