మిర్యాలగూడ, ఫిబ్రవరి 5: సీఎం రేవంత్‌రెడ్డి స్థాయిని మరచి తనను విమర్శించడం ఆయన అఙ్ఞానానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ‘రేవంత్ ఏ స్థాయి నుంచి వచ్చింది.. ఆయన పుట్టుపూర్వోత్తరాలు నాకు పూర్తిగా తెలుసు. ఆయన ఎవరి కాళ్లు పట్టుకున్నాడు. ఎవరి బూట్లు తుడిచాడో ఫొటోలు సహా నా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది’ అని రేవంత్‌ను హెచ్చరించారు.
గురువారం మిర్యాలగూడలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నన్ను జానారెడ్డి ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు. ఆయనతో కలిసి పార్టీలో పనిచేసిన. జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్? ఏం చేశావ్? అనేది గుర్తుంచుకోవాలి’ అని సూచించారు. కేసీఆర్ ఎవరు? ఆయన ఎవరికి జాతిపిత? అనడం సరికాదని అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన రేవంత్‌రెడ్డిని ఎవరైనా జాతిపిత అంటారా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లను, ఆఫీసర్లను బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర రేవంత్‌దని ఆరోపించారు. చిల్లర మాటల వల్ల ఆయన విలువే దిగజారిపోతుందని ఎద్దేవా చేశారు.
ఇకముందు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును ఇలాగే అసభ్య పదజాలంతో దూషిస్తే తాము పదిరెట్లు ఎక్కువ మాట్లాడుతామని హెచ్చరించారు. మిర్యాలగూడ పట్టణంలో కౌన్సిలర్లను నామినేషన్ వేయకుండా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. ఏదో ఉద్దేశంతో ఆయన కుటుంబసభ్యులతో నామినేషన్ దాఖలు చేయించారని, అది బెడిసి కొట్టడంతో ఒక కట్టుకథ అల్లి ప్రజలకు చెప్తున్నారని మండిపడ్డారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి రెండేండ్లు దాటినా ఇంతవరకు మిర్యాలగూడ పట్టణానికి తెచ్చిన నిధులేమి లేవని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి తన హోదాను మరిచిపోయి బజారు రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి 56 రోజులు చిప్పకూడు తిన్న చరిత్ర రేవంత్‌రెడ్డిదని, ఆయనపై ఇప్పటికీ 86 కేసులు ఉన్నాయని ఆరోపించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో పట్టా తీసుకున్న తరువాత కుక్క తోక ఎప్పుడూ వంకర అనే విధంగా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదని ధ్వజమెత్తారు.
కేసీఆర్ 14 ఏండ్లపాటు ఉద్యమాలు చేసి రాష్ర్ర్టాన్ని సాధించారని, ఆయన ఎప్పటికీ తెలంగాణకు జాతిపితనే అని పేర్కొన్నారు. కేసీఆర్‌ను తిట్టి గొప్పవాడిని కావాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నాడని, కానీ తెలంగాణ ప్రజలు ఆయన భాషను చూసి అసహ్యించుకుంటున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అఙ్ఞానానికి నిదర్శనమని అన్నారు. బూట్లు తుడిచిన చరిత్ర రేవంత్‌రెడ్డిదని అది గుర్తు తెచ్చుకోవాలని చెప్పారు. రాబోయే రోజుల్లో మీకు ప్రజలు తగిన రీతిలోనే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.