జనగామ, జూలై 7 (నమస్తే తెలంగాణ) : అధికారపార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి మద్యం మత్తులో మదమెక్కి వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నించిన ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని 9వ వార్డు (చాగల్లు)లో సోమవారం అర్ధరాత్రి జరిగింది. బాధితురాలి కుమారుడి కథనం ప్రకారం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరుడైన 9వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చౌదరపల్లి సంపత్‌రాజ్ సోమవారం అర్ధరాత్రి ఒంటిపై ఉన్న దుస్తులను కారులో వేసి నగ్నంగా బాధితురాలి ఇంట్లోకి చొరబడి లైంగికదాడికి యత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో బాత్రూమ్లోకి దూరడంతో వృద్ధురాలి మనుమడు బాత్రూమ్ డోర్‌కు గడియ పెట్టి కౌన్సిలర్‌ను బంధించారు.
విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు ఆగ్రహంతో కాంగ్రెస్ కౌన్సిలర్ కారును ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి కౌన్సిలర్ సంపత్‌రాజ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై 333, 74 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసుమోదు చేసి రిమాండ్‌కు తరలించామని స్టేషన్‌ఘన్‌పూర్ సీఐ వేణు తెలిపారు. ప్రజలకు అండగా నిలబడాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఇలాంటి నీచ కార్యానికి ఒడిగట్టడాన్ని గులాబీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. లైంగిక దాడికి యత్నంచేసిన కాంగ్రెస్ నాయకుడిపై క్రిమినల్ కేసులు పెట్టడంసహా కౌన్సిలర్ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన అనుచరుడి దురాగతాన్ని ఎలా సమర్థించుకుంటాడో చెప్పాలని నిలదీశారు.