బుధవారం 20 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 01:43:37

పోస్టాఫీసుల్లోనూ రైతుబంధు

పోస్టాఫీసుల్లోనూ రైతుబంధు

  • రాష్ట్రంలోని 4,860 చోట్ల మైక్రో ఏటీఎంలు
  • రోజుకు గరిష్ఠంగా 10 వేలు డ్రాకు అవకాశం
  • ఎలాంటి చార్జీలు ఉండవు:పోస్టుమాస్టర్‌ జనరల్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి పంపిణీ చేయనున్న రైతుబంధు మొత్తాన్ని రైతులకు నగదు రూపంలో ఇచ్చేందుకు పోస్టల్‌శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్రంలోని 4,860 పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ ఏటీఎంల ద్వారా రైతులు సులువుగా నగదును పొందవచ్చని పోస్టుమాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పీవీఎస్‌ రెడ్డి తెలిపారు. రైతుబంధు పథకంలో భాగంగా యాసంగి పెట్టుబడికి ఎకరాకు రూ.5 వేల చొప్పున సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులు ఆ సాయాన్ని నగదు రూపంలో పొందాలంటే బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద భారీ క్యూలు ఉంటాయి. ఒకవేళ ఏటీఎంల ద్వారా డ్రా చేసుకోవాలంటే అందుబాటులో ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పోస్టల్‌శాఖ పోస్టాఫీసుల్లోనే మైక్రో ఏటీఎంలను ఏర్పాటుచేస్తున్నది.

పోస్టాఫీసుల్లో నగదు డ్రా ఇలా..

  • రైతులు ఏ బ్యాంకు ఖాతాలైనా సరే ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌ లింకు ఉంటే ఆయా అకౌంట్లలో రైతుబంధు కింద జమైన మొత్తాన్ని సులువుగా డ్రా చేసుకోవచ్చు.
  • రైతులు బ్యాంకులు, ఆయా బ్యాంకుల ఏటీఎంలకు వెళ్లకుండానే సమీపంలోని పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన మైక్రో ఏటీఎంల ద్వారా నగదు పొందవచ్చు.
  • రైతులు మైక్రో ఏటీఎంల వద్దకు వెళ్లి బయోమెట్రిక్‌ (ఫింగర్‌ ప్రింట్‌) వేయగానే రిజిస్టర్‌ అయిన ఫోన్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని పోస్టు మాస్టర్‌కు చెప్తే ఆయన దానిని ఎంటర్‌చేస్తారు.
  • ఈ మైక్రో ఏటీఎంల ద్వారా ఒక ఖాతా నుంచి రోజుకు గరిష్ఠంగా రూ.10 వేలు డ్రా చేసుకోవచ్చు.
  • ప్రధానంగా మైక్రో ఏటీఎంల ద్వారా రైతులు నగదు పొందేందుకు ఎలాంటి చార్జీలు వసూలు చేయరు.


logo