ఖలీల్‌వాడి, నవంబర్ 23: ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటేయాలని, లేకుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్‌లో కొత్తగా ఓటు హక్కు పొందిన విద్యార్థినులతో గురువారం ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత సమాధానం ఇస్తూ.. ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత క్రీయాశీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఏమిటన్న ధోరణిలో ఉండొద్దని సూచించారు. ఓటు హక్కును వినియోగించుకోకపోతే వ్యవస్థలు నిర్వీర్యమవుతాయని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. రాజకీయాల్లోకి వచ్చే మహిళలు, యువతకు ఏం సందేశమిస్తారని ఓ యువతి అడిగిన ప్రశ్నకు కవిత సమాధానమిస్తూ.. రాజకీయాలు అంత సులువు కాదని, అయితే.. రాజకీయ నాయకులుగా తీసుకునే ఓ నిర్ణయం కోట్ల మంది జీవితాలను మార్చుతుందని, అందుకే కష్టపడి ప్రజల కోసం పనిచేయాలని సూచించా రు.
ప్రభుత్వరంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? స్వయం ఉపాధి, జిల్లాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటుపై యువతులు అడిగిన ప్రశ్నలకు కవిత స్పందిస్తూ.. రాష్ర్టానికి దాదాపు 22 వేల కంపెనీలు వచ్చాయని, దాంతో 30 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చాయని, పరోక్షంగా మరో 30 లక్షల మందికి ఉపాధి లభించిందని వివరించారు. స్వయం ఉపాధి కోసం స్టార్టప్‌లను ప్రోత్సహించి చేయూతనిస్తున్నామని చెప్పారు. టీఎస్ పీఎస్సీలో సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందని ఓ యువతి అడగగా.. రాష్ట్రంలో ఒకే ఒక్కసారి పేపర్ లీక్ ఉదంతం జరిగిందని, 10 రోజుల్లో నే నిందితులను పట్టుకున్నామని, ఒక రాజకీయ పార్టీ ప్రమేయముందని గుర్తించామని వివరించారు.
బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలని ఓ విద్యార్థిని ప్రశ్నించగా.. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ కొట్లాడిందని చెప్పారు. రాష్ట్రం వచ్చాక అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తున్నది. అందుకే కారు గుర్తుకు ఓటు వేయాలని కవిత బదులిచ్చారు. తొలిసారి ఓటు వేసినప్పటి అనుభవం చెప్పాలని ఒక విద్యార్థిని కోరగా.. తాను మొదటి నుంచి తన తండ్రికే ఓటు వేశానని, చింతమడకలో తొలిసారి తల్లిదండ్రులతో కలిసి ఓటు వేశానని, అది ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం అని చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆడపిల్లలను వేధించేవారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని స్పష్టం చేశారు.