బడంగ్‌పేట, ఆగస్టు26: ‘అలుగు ఉంది.. కానీ చెరువు ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించడం లేదు. కాస్త వెతికిపెట్టండి సారూ’ అంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అం దెల శ్రీరాములు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్దార్‌నగర్ రెవన్యూపరిధిలో 8ఎకరాల్లో ఉండే తుమ్మల చెరువు కనిపించడం లేదని పహాడీషరీఫ్ పోలీసులను ఆశ్రయించారు.
చెరువు ఎక్కడ ఉందో కనిపించడంలేదని.. చెరువు అలుగు మాత్రమే కనిపిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా కూ ల్చివేతల నేపథ్యంలో తుమ్మల చెరువు కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్‌టాఫిక్‌గా మారింది. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాళ్లచెరువు నామరూపాల్లేవని, జల్పల్లిలో పెద్దచెరువు భూములను నోటరీలు చేసి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. చెరువుల్లోని భూములను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. హైడ్రా పేరుతో డ్రామాలు చేయకుండా నిజాయితీగా చెరువులను చెరబట్టిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.