Jagdish Reddy | ఉడుత ఊపులకు, కుక్క అరుపులకు గులాబీ శ్రేణులు దడవవని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. మోదీ సర్కార్ నిర్ణయాలు తీసుకున్న ఫలితంగానే ఓడిపోయామన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలన జరుపకుండానే ఢిల్లీలో కూర్చుని కాళేశ్వరం మీద ఎన్నికలకు రెండురోజుల ముందట విడుదల చేసిన నివేదికనే ఇందుకు తార్కాణమన్నారు. అప్పటికీ, ఇప్పటికీ తెలంగాణ ప్రజలు గులాబీ బాస్ కేసీఆర్ వెంటే ఉన్నారని తేల్చిచెప్పారు. కేసులకు, దాడులకు గులాబీ శ్రేణులు భయపడరని స్పష్టం చేశారు.
అధికార పార్టీ అరాచకాలపై గులాబీ దండు తిరగబడితే పాలక కాంగ్రెస్ పక్షం పత్తా దొరకదంటూ హెచ్చరించారు. అదే జరిగితే కాంగ్రెస్ పాలకులు ఢిల్లీలో తల దాచుకోవాల్సిన దుస్థితి ఎదురవుతుందన్నారు. దాడులతో రెచ్చిపోతే ఉపేక్షించేది లేదన్నారు. మొన్న సూర్యాపేట, నిన్న భోనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఉదంతాలను ఆయన వివరించారు. అధికారం ఉంది కదా అని అహంకారంతో ప్రవర్తిస్తే తెలంగాణ సమాజం ఉపేక్షించబోదన్నారు. నిజాం నవాబులను తరిమిన గడ్డ ఇదని అంతకంటే కాంగ్రెస్ పాలకులు ఎక్కువ కాదన్నారు. కొందరు రండలు కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఈ ఉడుత ఊపులకు, కుక్క అరుపులకు గులాబీ శ్రేణులు దడవారన్నారు.
మీరు ఆంధ్రాబాస్ వద్ద మొకరిల్లిన రోజునే మెడలు వంచి తెలంగాణ సాధించిన నేత కేసీఆర్ లాంటి నేత సారథ్యంలో పని చేసిన గులాబీ దండును ఎవరూ ఏమీ చెయ్యలేరన్నారు. ఆ మాటకు వస్తే తెలంగాణ మాదని ఎంత మాత్రం మీది కాదన్నారు. కేసీఆర్ సాధించిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రి పడవులతో పాటు టీపీసీసీ, టీ బీజేపీ ఇతర పార్టీలకు సారథ్యం వహిస్తున్నారన్నారు. అది కేసీఆర్ భిక్ష మాత్రమేనని స్పష్టం చేశారు. పైసలున్నా కాంగ్రెస్ పాలకులకు పాలన చేత కాదని దుయ్యబట్టారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన వారికి మాత్రమే పాలనానుభవం ఉంటుందన్నారు. చంద్రబాబు చెప్పులు మోసిన వారికి, వైఎస్సార్ బూట్లు నాకినోళ్లకు పాలనా అనుభవం ఎక్కడిదన్నారు. అప్పులు చెయ్యమన్నదే కాంగ్రెస్ పార్టీ నేతలని.. ఆ అప్పు మాఫీ చేయాలని అడిగితే చెప్పులతో కొట్టండి, కాలర్ పట్టి నెట్టండి అంటూ స్వయంగా మంత్రులు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాలనానుభవం ఏ పాటిదో అన్నది ఇట్టే తేలిపోతుందన్నారు. ఇదేనా తెలంగాణా సమాజం కోరుకున్న మార్పు అంటూ కాంగ్రెస్ పాలకులపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు.