శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:11:38

ప్రతిపక్షాల శవ రాజకీయాలు

ప్రతిపక్షాల శవ రాజకీయాలు

  • రైతు బ్యాగరి నర్సింలు మృతి బాధాకరం
  • ఆయన ఆత్మహత్యకు ప్రభుత్వానికి సంబంధం లేదు  
  • కాంగ్రెస్‌ హయాంలోనే సబ్‌స్టేషన్‌ నిర్మాణం
  • రాజేశ్‌గౌడ్‌ నుంచి 2014లో స్థల సేకరణ
  • నర్సింలుది రాజకీయ ప్రేరేపిత హత్య 
  • కాల్‌డాటాతో బాధ్యులను పట్టుకుంటాం
  • నర్సింలు కుటుంబానికి 2 లక్షల సాయం 
  • ఎకరం భూమితోపాటు ఎక్స్‌గ్రేషియా
  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

గజ్వేల్‌ అర్బన్‌: విపక్షాలవి శవాలపై పేలాలు ఏరుకునే రాజకీయాలు.. 2014లో కాంగ్రెస్‌ హయాంలోనే రైతు బ్యాగరి నర్సింలుకు సంబంధించిన భూమిలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించారు.. ఆయన మృతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్న ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నాయి..  నర్సింలు ఆత్మహత్య దురదృష్టకరం.. సెల్‌ఫోన్‌ కాల్‌డాటా సాయంతో విచారణ చేసి మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టంచేశారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ఐవోసీలోని గడా కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. 

గజ్వేల్‌ నియోజకవర్గం వర్గల్‌ మండలం వేలూరు గ్రామానికి చెందిన బ్యాగరి నర్సింలు(38) బుధవారం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు.  రెవెన్యూ రికార్డుల ప్రకారం 2014 సంవత్సరానికి ముందే బ్యాగరి నర్సింలు తన భూమిని వ్యాపారి రాజేశ్‌గౌడ్‌కు విక్రయించాడన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనే 2014లో అప్పటి తాసిల్దార్‌ శ్రీనివాస్‌ ఎకరం భూమి తీసుకుని సబ్‌స్టేషన్‌ నిర్మించారని, దానిలో 14 గుంటల భూమి ఇప్పటివరకు సాగులో లేదన్నారు. సాగులో లేని ప్రభుత్వ భూమిలోనే రైతువేదిక నిర్మాణాన్ని చేపడుతున్నట్లు మంత్రి స్పష్టంచేశారు.  ఇవేమీ తెలియకుండా స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, సదరు భూమి కొనుగోలు చేసిన వ్యాపారి అయోమయానికి గురిచేసి నర్సింలును ఆత్మహత్యకు ప్రేరేపించారని మంత్రి పేర్కొన్నారు. నర్సింలు మృతి విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తప్పిదమేమీ లేదన్నారు. ప్రతిపక్షాల నీచ రాజకీయాల వల్ల నర్సింలు కుటుంబం దిక్కులేనిదయ్యిందని  ఆవేదన వ్యక్తంచేశారు. 

నర్సింలు కుటుంబానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని, అతని కుటుంబానికి తక్షణ సాయంగా రూ.2 లక్షలు అందజేస్తున్నామని, త్వరలో ఎకరం భూమితోపాటు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. నర్సింలు కూతురు చదువుకు అయ్యే పూర్తిఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. నర్సింలు మృతికి కారణమైన వారిని శిక్షిస్తామని హరీశ్‌రావు చెప్పారు. సమావేశలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్‌ అన్నపూర్ణ శ్రీనివాస్‌, మాజీ హౌసింగ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి పాల్గొన్నారు.

నర్సింలు మృతదేహానికి అంత్యక్రియలు

రైతు నర్సింలు పురుగు మందు తాగి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ నర్సింలు మృతిచెందాడు. గురువారం రాత్రి గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.

రైతు వేదిక భూమిపూజలో సంతోషంగా పాల్గొన్న రైతు నర్సింలు

వేలూరులో ఇటీవల నిర్వహించిన రైతు వేదిక భూమి పూజలో రైతు బ్యాగరి నర్సింలు సంతోషంగా పాల్గొన్నాడని మంత్రి పేర్కొన్నారు. రైతు వేదిక నిర్మాణంతో రైతులకు మంచి జరుగుతుందని సంతోషం వ్యక్తం చేసిన నర్సింలు ప్రభుత్వం భూమి లాక్కుందని ఆత్మహత్య చేసుకోవడం ఏమిటని మంత్రి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. వ్యక్తిగతంగా అమాయకుడైన నర్సింలును రెచ్చగొట్టి ప్రతిపక్షాల నాయకులు ఆత్మహత్యకు ఉసిగొల్పారని పేర్కొన్నారు. ఈ విషయాలు తెలియకుండా కాంగ్రెస్‌, బీజేసీ రాష్ట్ర నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శవరాజకీయాలు మానుకుని ఇకనైనా బుద్ధిగా ఉండి ప్రజాసంక్షేమానికి సహకరించాలన్నారు.


logo