కొల్లాపూర్ : ఆలయానికి మంజూరైన నిధుల రద్దుపై నిలదీసిన గ్రామస్థులపై మంత్రి జూపల్లి, కాంగ్రెస్ నాయకులు ( Congress Leaders ) దౌర్జాన్యానికి పాల్పడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న బ్రహోత్సవాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) , జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పటేల్ సమక్షంలో సమీక్షను నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆలయ అభివృద్ధికి రూ. 15 కోట్లు మంజూరు చేయించగా ఎందుకు రద్దు చేయించారని మంత్రి జూపల్లిని సింగిల్ విండో మాజీ చైర్మన్ చింతకుంట శ్రీనివాసులు, మాజీ ఉప సర్పంచ్ చించెట్టి సత్యనారాయణ ప్రశ్నించారు.

గత ప్రభుత్వ ప్రోసిడింగు జీవో చూసిన వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవేశంతో ఒక్కసారిగా గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలని ఫేక్ జీవోలని ఆరోపించారు. మంత్రికి తోడుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిల్ విండో చైర్మన్ పైకి దూసుకొని రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి . మంత్రి జూపల్లి సముదాయించిన జిల్లా కలెక్టర్ , ఎస్పీ సమక్షంలోనే ఆలయ అభివృద్ధి గురించి అడిగిన వారిపైకి దౌర్జన్యంగా వెళ్లడాన్ని పలువురు సైతం తప్పు పట్టారు.
ఉప సర్పంచ్ తమకం సాయి కృష్ణ గౌడ్ ఆలయానికి నిధుల విషయమై నిలదీశారు. కొట్లాడితే నిధులు రావని మంత్రి జూపల్లి సమాధానమిచ్చారు. బ్రహ్మోత్సవాలకు నాలుగు రోజులు ముందు సమీక్ష ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ అభివృద్ధి పై ప్రశ్నించిన వారిపై అధికార దర్పం ప్రదర్శించడం పట్ల గ్రామస్థులు సైతం విస్తుపోయారు. చివరకు వాగ్వాదం మద్యనే సమీక్షా సమావేశం తూ తూ మంత్రంగా ముగిసింది.