మైండ్ స్పేస్ జంక్షన్.. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టింది. కొండాపూర్ టు బంజారాహిల్స్, టోలిచౌకి టు హైటెక్ సిటీ.. కూకట్పల్లి ప్రాంతాలకు నిత్యం వేలాది వాహనాలు ఈ జంక్షన్ గుండానే ప్రయాణిస్తుంటాయి. ట్రాఫిక్ పరంగా చిన్నపాటి సమస్య కూడా తలెత్తకుండా ప్రభుత్వం ఈ జంక్షన్‌ను ఏర్పాటు చేసింది. పైన ఫ్లైఓవర్, కింద అండర్ పాస్, మధ్యలో రోడ్డు మార్గం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తక్కువ సమయంలో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. రాత్రి వేళల్లో సాఫ్ట్వేర్ కంపెనీల భవనాలు విద్యుత్ కాంతుల వెలుగులతో మిరుమిట్లు గొలుపుతాయి. ఈ సుందర చిత్రాలను యువత, పర్యాటకులు తమ సెల్ఫోన్లు, కెమెరాల్లో బంధించడం నిత్యం ఇక్కడ కనిపిస్తుంటుంది.