Cab Drivers | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): అది భారత జోడో యాత్ర. 2022 నవంబర్ 2న కూకట్‌పల్లిలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. డ్రైవర్లు, గిగ్ వర్కర్ల కష్టాలను తెలుసుకోవడానికంటూ కొందరు యూనియన్ నాయకులు, డ్రైవర్లను పిలిపించుకొని చర్చించారు. ఈ సందర్భంగా క్యాబ్, ఆటో, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ తమ కష్టాలను వివరించారు. దీంతో మీ అందరికీ న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారు. అనంతరం మరోసారి జూబ్లీహిల్స్‌లో ఏర్పాటుచేసిన సభలోనూ డ్రైవర్లతో సమావేశమై, తమ ప్రభుత్వం కొలువుదీరితే సమస్యలన్నీ పరిష్కరిస్తామని మళ్లీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వారం రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మళ్లీ మీటింగ్ పెట్టి డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. దీంతో డ్రైవర్లందరూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండున్నరేండ్లు కావొస్తున్నది. కానీ అప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, తమకు హక్కుగా రావాల్సిన ప్రభుత్వ పథకాలను కూడా దూరం చేస్తున్నదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని నాంపల్లిలో క్యాబ్ డ్రైవర్ల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కారు ఉన్నదనే కారణంతో ప్రభుత్వం తమకు బీపీఎల్ రేషన్ కార్డు ఇవ్వడం లేదని వాపోయారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు వంటివి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘అయ్యా మేం పేదవాళ్లమే. మాకు కారు ఉన్నా, అది కమర్షియల్ వాహనం. దాన్ని నడిపితేనే మా కుటుంబం నడుస్తుంది. అది మా ఆస్తి కాదు, ఉపాధి’ అంటూ డ్రైవర్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో క్యాబ్ డ్రైవర్ల వివరాలను ఇష్టానుసారంగా పొందుపరిచి, ఉపాధి కోసం నడిపే వాహనాన్ని కూడా ఆస్తిగా చూపించారని వాపోతున్నారు. ప్రజాభవన్‌లో అనేక సార్లు తమకు జరిగిన అన్యాయంపై దరఖాస్తులు అందించామని, అయినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ నాయకులు షేక్ సలావుద్దీన్, నగేశ్ తెలిపారు.
కారు నడపకపోతే మా కుటుంబం నడవడమే కష్టం. అదే మా ఉపాధి. ఉద్యోగం దొరకక డ్రైవర్‌గా మారితే ప్రభుత్వ పథకాలు కూడా రానివ్వకుండా కాంగ్రెస్ మోసం చేసింది. ఇదెక్కడి న్యాయం. కారు మాది కాదు. నెలనెలా ఈఎంఐలు చెల్లించకపోతే కంపెనీ వాడు లాక్కుంటాడు.
కారు ఉందని రేషన్ కార్డు ఇవ్వకపోవడం దారుణం. ప్రభుత్వం డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి.
-బీ రవి, క్యాబ్ డ్రైవర్
ప్రభుత్వం క్యాబ్ డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నది. డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దరఖాస్తు చేసుకుంటే రిజెక్ట్ చేసింది. కనీసం రేషన్ కార్డుకు కూడా అర్హులం కాదట. ఓవైపు గిరాకీ లేక సతమతమవుతుంటే ప్రభుత్వ పథకాలకు దూరం చెయ్యడం అన్యాయం. రాష్ట్రవ్యాప్తంగా క్యాబ్ డ్రైవర్లందరం సర్కార్‌పై పోరుకు సిద్ధమవుతాం. -నగేశ్, క్యాబ్ అసోసియేషన్ నాయకుడు