తాడ్వాయి, సెప్టెంబర్ 27 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. సమ్మక్క, సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో ఆదివారం మేడారంలోని వనదేవతల గద్దెల ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాల ప్రకారం మినీ జాతర నిర్వహణకు అనువైన ఘడియలను అనుసరించి సమ్మక్క, సారలమ్మ మినీ జాతరను వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 బుధవారం నుంచి 20వ తేదీ శనివారం వరకు నిర్వహించాలని నిర్ణయించారు.
రెండేండ్లకోసారి జరిగే అమ్మవార్ల మహాజాతర అనంతరం వచ్చే ఏడాది మినీ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ మినీ జాతరలో సమ్మక్క, సారలమ్మ తల్లులను గద్దెలపైకి తీసుకురావడం మినహా మిగతా పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. మేడారంలోని సమ్మక్క పూజామందిరం, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో పూజారులు ఆదివాసీ ఆచార వ్యవహాల ప్రకారం తల్లులకు నాలుగు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మినీ జాతరకు దేశం నలుమూలల నుంచి తల్లులను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారని, వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.