Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మావోయిస్టులను నిర్మూలించేందుకు రాష్ట్ర పోలీసుశాఖ ‘కోవర్టు ఆపరేషన్లు’ ప్రోత్సహిస్తున్నదా? ‘ద్రోహి’ సినిమాలో మాదిరిగా కోవర్టులను ఉద్యమంలోకి పంపుతున్నదా? మావోయిస్టుల కుటుంబసభ్యులను చంపేస్తామని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఆధారాలు రాబడుతున్నదా? ఈ ప్రశ్నలకు మావోయిస్టు బంటి రాధ ఉదంతం అవుననే సమాధనం ఇస్తున్నది.
ఇటీవల ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు రాధ అనే దళ సభ్యురాలిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఆమె ఫోన్ నుంచి విడుదలైనట్టుగా చెప్తున్న ఓ ఆడియో ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నది. ఆ వీడియో నిజంగానే రాధ ఫోన్ నుంచి వచ్చిందా? లేక మరెవరైనా మాట్లాడారా? రాధ హత్యకు ఆ ఆడియోనే కారణమా? ఆమె నిజంగా పోలీసులకు మావోయిస్టుల వివరాలు వెల్లడించిందా అన్నది తేలాల్సి ఉన్నది.
రాధ తమ్ముడి ద్వారా ఆమె ఫోన్ నంబర్ తీసుకున్న పోలీసులు.. ఆమెను పలు విధాలుగా బ్లాక్ మెయిల్ చేసినట్టు ఆడియోను బట్టి తెస్తున్నది. ఇంటెలిజెన్స్ పోలీసులు.. వేర్వేరు నంబర్ల ద్వారా ఆమెను సంప్రదించి.. తమ్ముడ్ని, తల్లిని, తండ్రిని, స్నేహితురాలిని కిరాతకంగా హత్య చేస్తామని బెదిరించినట్టు ఆడియోలో వినిపిస్తున్నది. మావోయిస్టులను కలిసే ప్రజా సంఘాల నేతలు ఎవరు? వారు ఎక్కడ.. ఎలా కలుస్తున్నారు? మావోయిస్టులకు ఏ రకంగా సహకారం అందిస్తున్నారు? అనే విషయాలు చెప్పాలని ఆమెపై ఒత్తిడి తెచ్చినట్టు ఆ ఆడియోలో ఉంది. అయినా రాధ పోలీసులకు ఆ సమాచారం ఇవ్వలేదని తెలుస్తున్నది. ఆ సమాచారం చెప్పకపోతే మొదట తనకు ఇష్టమైన తమ్ముడ్ని, ఆ తర్వాత కుటుంబాన్ని పోషించే తల్లిని, స్నేహితులను వరుసగా అత్యంత కర్కశంగా చంపుతామని పోలీసులు బెదిరించినట్టు ఆ ఆడియోలో రాధ చెప్పింది. ఇదే విషయమై పలు విధాలుగా ఆమె ఫోన్ను ట్రాక్ చేసి, సమాచారం కోసం వేధించినట్టు పేర్కొంది.
పోలీసులు కోవర్టులను పెట్టి తమ ఆపరేషన్ను అమలు చేస్తున్నారని ఇటీవల మావోయిస్టులు విడుదల చేస్తున్న లేఖల ద్వారా స్పష్టమవుతున్నది. కోవర్టులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే దళ సభ్యులను జిల్లాల సరిహద్దుల్లో పట్టుకొని.. చిత్రహింసలు పెట్టి.. ఛత్తీస్గఢ్లో బూటకపు ఎన్కౌంటర్ల పేరిట హతమారుస్తున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. మార్చి 19న దుమ్ముగూడెం ప్రాంతంలో నలుగురు మావోయిస్టులకు అన్నంలో మత్తుమందు పెట్టి, అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్ చేసినట్టు ఆధారాలతో సహా బయటపెట్టారు. గురువారం ఉదయం కర్కగూడెంలో ఎన్కౌంటర్ కూడా కోవర్టులు ఇచ్చిన సమాచారంతోనే జరిగిందని లేఖలో పేర్కొన్నారు.