Mamanur Airport | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్పేట: భూసేకరణ పూర్తయిన తర్వాత మామనూరు ఎయిర్పోర్ట్ను రెండున్నరేండ్లలో నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు తెలిపారు. హైదరాబాద్ కవాడిగూడలోని కేంద్ర ప్రభుత్వ సముదాయంలో (సీజీవో టవర్స్) మరో కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఎయిర్పోర్ట్కు తన హయాంలో అనుమతులు రావడం సంతృప్తిగా ఉన్నదని చెప్పారు.
దేశానికి స్వాతంత్య్రం రాకముందే 696 ఎకరాల్లో మామునూరులో విమానాశ్రయం ఉండేదని, 1981 వరకు అక్కడ విమానయాన సేవలు కొనసాగాయని చెప్పారు. అక్కడ కేవలం 1800 మీటర్లలో ఉన్న రన్వే ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నదని తెలిపారు. నూతన విమానాశ్రయ నిర్మాణానికి 2,800 మీటర్ల రన్వే అవసరమని, ఇందుకోసం 280 ఎకరాలు అదనంగా భూసేకరణ అవసరమని కేంద్రం నుంచి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
రాష్ట్రప్రభుత్వం త్వరగా భూసేకరణ చేస్తే విమానాశ్రయం పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా మామునూరులో టెర్మినల్ భవనాన్ని నిర్మించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. విమానాశ్రయం ఏర్పాటైతే వరంగల్లో టెక్స్టైల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, విద్యారంగంలో అపారమైన అవకాశాలు వస్తాయని, పర్యాటకరంగం అభివృద్ధి చెందుతుందని వివరించారు.
భద్రాద్రి విమానాశ్రయం విషయంలో గతంలో ఒక స్థలాన్ని ప్రతిపాదించారని, అది అనువుగా లేకపోవడంతో మరో స్థలం ప్రతిపాదించారని చెప్పారు. కొత్త స్థలంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రానికి ముందు దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా వరంగల్ (మామునూరు) ఎయిర్ పోర్ట్కు గుర్తింపు ఉన్నదని చెప్పారు. ఈ విమానాశ్రయానికి పునర్వైభవం కల్పించడం ద్వారా వరంగల్ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు వేయాలని కేంద్రం భావిస్తున్నదని చెప్పారు. భద్రాచలం, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి నగరాల్లోనూ విమాన సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.