‘పేరు గొప్ప .. ఫలితం దిబ్బ’ అన్న చందంగా మారిన మోదీసర్కారు పథకాల్లో మేకిన్ ఇండియా కూడా చేరింది. దేశీయ కంపెనీలను, ఉత్పత్తులను ప్రోత్సహించడానికి తెచ్చిన ఈ పథకం లక్ష్యాన్ని చేరకపోగా.. ఉన్న పరిశ్రమలకూ తాళాలు వేసే పరిస్థితి నెలకొన్నది. గత 9 ఏండ్లలో దేశవ్యాప్తంగా సుమారు 9.85 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి.
Make In India | హైదరాబాద్, సెప్టెంబర్ 27 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ఆరంభశూరత్వంలో దేశ ప్రధాని నరేంద్రమోదీ అగ్రగణ్యులు. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు.. కుప్పలుతెప్పలుగా ఆర్భాటపు ప్రకటనలు, స్కీమ్‌లను ప్రవేశపెట్టారు. అయితే, అందులో ఏ ఒక్కటీ విజయం సాధించిన దాఖలాలు లేవు. ఉదాహరణకు.. 2014, సెప్టెంబర్ 25న ‘మేకిన్ ఇండియా’ పేరిట బీజేపీ సర్కారు పెద్దయెత్తున ప్రచారానికి తెరతీసింది. గత సోమవారంనాటికి తొమ్మిదేండ్లు గడిచి పదేండ్లలోకి ఈ స్కీమ్ అడుగిడింది. అయినప్పటికీ, కేంద్రం దీనిపై ఏ ఒక్క ప్రకటనను కూడా విడుదల చేయలేదు. కారణం ఏమిటంటే, స్వదేశీ కంపెనీలను, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి అంటూ తీసుకొచ్చిన ‘మేకిన్ ఇండియా’ పథకం ఘోరంగా వైఫల్యమవ్వడమే.
తయారీరంగంలో ఏటా 12-14 శాతం వృద్ధిరేటు నమోదు, 2022నాటికి జీడీపీలో తయారీరంగం వాటాను 25 శాతానికి పెంచడం, 2022నాటికి తయారీరంగంలో 10 కోట్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ‘మేకిన్ ఇండియా’ స్కీమ్‌ను కేంద్రం ఆర్భాటంగా తీసుకొచ్చింది. అయితే, క్షేత్రస్థాయిలో ఇవేమీ జరుగలేదు. 2013-14 నుంచి ఇప్పటివరకూ తయారీరంగంలో వృద్ధిరేటు 5.9 శాతం దాటలేదు. జీడీపీలో తయారీరంగం వాటా 16.4 శాతానికే పరిమితమైంది. తయారీరంగంలో ఉద్యోగాలు 2011-12లో 12.6 శాతంగా ఉంటే, 2021-22 నాటికి 11.6 శాతానికి పడిపోయాయి. ముఖ్యంగా 2016-21 మధ్య ఉద్యోగాలు సగానికి తగ్గిపోయాయి. ఈ గణాంకాలను విశ్లేషిస్తే, మేకిన్ ఇండియా అట్టర్ ఫ్లాప్ అయినట్టు అర్థమవుతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క తయారీ రంగంలోనే 10,655 సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు మూతబడ్డాయి.