హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థుల జాబితా రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించే నాయకులు అర డజను మందికిపైగా ఉండగా, తాజాగా ఆ జాబితాలో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కూడా చేరారు. ఆదివారం ఇండియా టుడే నిర్వహించిన రౌండ్ టేబుల్ డిబేట్లో తాను కూడా సీఎం అభ్యర్థినేనని ఆయన ప్రకటించుకున్నారు. ‘కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు..ఇంతకీ మీ సీఎం అభ్యర్థి ఎవరు?’ అని డిబేట్ నిర్వాహకురాలు ప్రశ్నించగా.. ‘నేనేందుకు కాదు’ (వై నాట్ మీ) అని ఆమెను ఎదురు ప్రశ్నించారు. తాను కూడా సీఎం రేస్‌లో ఉన్నట్టు చెప్పకనే చెప్పారు. ఇప్పటికే తెలంగాణ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీతక్క, సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కుందూరు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు తామకు తామే సీఎం అభ్యర్థులుగా భావిస్తున్నారు.