హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో జూలై 9 (నమస్తే తెలంగాణ), అమీర్‌పేట్: బల్కంపేట ఎల్లమ్మ సాక్షిగా ప్రొటోకాల్ వివాదం అగ్గి రాజేసింది. మంగళవారం ఎల్లమ్మ కల్యాణ మహోత్సవానికి కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన రవాణాశాఖ మంత్రి, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌కు ఉన్నతాధికారులు స్వాగతం పలకలేదు. ఆ సమయంలో కల్యాణ టికెట్లు ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో మంత్రి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని లోపలికి తీసుకెళ్లేందుకు పోలీసులు బారికేడ్లు తెరిచారు. దీంతో ఒక్కసారిగా భక్తులు లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఈ తోపులాటలో మంత్రి పొన్నం కుదుపునకు గురి కాగా, మేయర్ కింద పడిపోయారు. తనకు ఎదురైన చేదు అనుభవంతో అసహనానికి గురైన మంత్రి.. అక్కడ ఉన్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పక్కనే ఉన్న రోడ్డు డివైడర్‌పై కూర్చుండిపోయారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హుటాహుటిన మంత్రి వద్దకు వచ్చి సముదాయించి ఆలయం లోపలికి తీసుకెళ్లారు. మంత్రి పొన్నం రాకముందే.. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కల్యాణోత్సవానికి వచ్చారు. ఆమెకు దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్, పోలీసు అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే కుటుంబసభ్యులతో మంత్రి పొన్నం కూడా రావటంతో ఆయనకు స్వాగతం పలికేందుకు అక్కడ ఎవ్వరూ అందుబాటులో లేరు.
ఆలయం వద్ద అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవటంతో మంత్రి అలిగారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా వారు స్పందించలేదనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ‘నమస్తే తెలంగాణ’ మాట్లాడగా.. అలాంటిదేమి లేదని, అక్కడ జరిగిందొక్కటి, సోషల్‌మీడియాలో వస్తున్నదొకటని ఖండించారు. తోపులాట జరగటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పక్కకు వచ్చామని తెలిపారు. పోలీసులతో మాట్లాడి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం చేశానని వెల్లడించారు. దీనికే తాను అలిగానని ట్రోల్ చేశారని చెప్పారు. కాగా, తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా సోషల్‌మీడియాలో అసభ్యకర వీడియోలు పోస్ట్ చేశారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేవాలయంలో తోపులాట వెనుక కుట్ర కోణం దాగున్నదని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దేవాలయానికి వచ్చిన సందర్భంలో కొందరు రాజకీయ ప్రేరేపిత అల్లరిమూకలు కావాలని తోపులాటకు దిగి శాంతిభద్రతల సమస్య తలెత్తేలా కుట్రకు పాల్పడ్డారని తెలిపారు. పోలీస్‌శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. ఘటనపై సచివాలయంలో మంత్రులు సురేఖ, పొన్నం ప్రభాకర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఓ మహిళా జర్నలిస్టును డ్యూటీలో ఉన్న ఎస్సై దుర్భాషలాడిన విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేపట్టి సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు.