హైదరాబాద్: హైదరాబాద్‌లో (Hyderabad) వాన (Rain) మళ్లీ మొదలైంది. రెండు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం నిలిచిపోయింది. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయింది. కోఠి, నాంపల్లి, లక్డీకపూల్, మాసబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్టా, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్, కొండాపూర్, ఏఎస్ రావు నగర్, కూకట్పల్లి, నీజాంపేట్, మూసాపేట్, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, ప్రగతి నగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. నగర వ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. నేడు హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కుసే అవకాశాలున్నాయి.
కాగా, బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం నాటికి బలహీనపడిందని, ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ పరిసరాల్లో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కే నాగరత్న తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని చెప్పారు. దీని ప్రభావంతో వచ్చే మూడ్రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.
శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వివరించారు.