హైదరాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్‌గా లారా విలియమ్స్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జెన్నిఫర్ లార్సన్ ఇటీవల బదిలీ కావడంతో ఆమె స్థానంలో లారాను నియమించారు. యూఎస్ ఫారిన్ సర్వీసెస్ సీనియర్ అధికారి అయిన లారా విలియన్స్కు.. విదేశీ వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్నట్టు కాన్సుల్ జనరల్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
గతంలో ఆమె అమెరికా విదేశాంగశాఖలో ఎంటర్ప్రైజ్ సర్వీసెస్‌కు డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారిగా పనిచేశారు. అంతేకాకుండా వాషింగ్టన్ డీసీలోని యూఎస్ విదేశాంగశాఖ ప్రధాన కార్యాలయంతోపాటు నికోసియా, అల్జీర్స్, రోమ్, మెక్సికో తదితర రాయబార కార్యాలయాల్లో పనిచేశారు. ఈ సందర్భంగా లారావిలియమ్స్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్‌గా నియామకమవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ, ఏపీ, ఒడిశాలతో యూఎస్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తన వంతు కృషిచేస్తానని తెలిపారు.