e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home Top Slides బడుగుల భూమిలో ఈటల పాగా

బడుగుల భూమిలో ఈటల పాగా

బడుగుల భూమిలో ఈటల పాగా
  • 100 ఎకరాల అసైన్డ్‌ భూమిలో మంత్రి కుటుంబం కబ్జా

రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ పెను భూ వివాదంలో కూరుకుపోయారు. బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్‌ భూమిని చట్టవ్యతిరేకంగా ఈటల తన కుటుంబసభ్యుల పేరు మీదికి మార్పించుకున్నట్టు శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

జీవనోపాధి కోసం ప్రభుత్వం తమకు ఇచ్చిన భూమిని ఈటల కుటుంబం బలవంతంగా స్వాధీనం చేసుకున్నదని మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలానికి చెందిన రైతులు ఆరోపించారు. చట్టానికి వ్యతిరేకంగా బెదిరించి, భయపెట్టి, పోలీసులతో కొట్టించి, ఈటల కుటుంబం, బంధువులు తమ భూములు లాక్కున్నారని వారు పేర్కొన్నారు. ఈ మేరకు వారు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. దానిని మీడియాకు విడుదల చేశారు.

ఈ వ్యవహారాన్ని పలు టీవీ చానళ్లు బిగ్‌ స్టోరీ కింద ప్రసారం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా, రాజకీయంగా సంచలనం చెలరేగింది. క్యాబినెట్‌లోని సీనియర్‌ మంత్రిపై ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే స్పందించారు. దీనిపై సమగ్రంగా విచారణ జరుపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. వెంటనే ప్రాథమిక నివేదిక అందజేయాలని విజిలెన్స్‌ డీజీకి ఆదేశాలు జారీ చేశారు.

ఆక్రమణకు గురైన తమ భూములను విడిపించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఫిర్యాదు ప్రతులను మీడియా ప్రతినిధులకు కూడా అందించారు. తమకు జరిగిన అన్యాయాలను, ఈటల అనుచరుల దౌర్జన్యాలను వెళ్లబోసుకున్నారు. ఈ విషయాలు మీడియాలో సంచలనం రేపడంతో సీరియస్‌గా పరిగణించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సత్వరమే ఈ వ్యవహారంలో విచారణ జరిపించి, నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. దీనిపై వెంటనే ప్రాథమిక నివేదికను అందించి, అనంతరం సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర విజిలెన్స్‌ డీజీ పూర్ణచందర్‌రావును కూడా ఆదేశించారు.

భూదందాల ఈటల
ఈటల, ఆయన అనుచరుల భూదందాపై మరిన్ని విషయాలను బాధితులు వివరిస్తున్నారు. 2016లో మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో తొలుత 40 ఎకరాలను సేకరించిన ఈటల రాజేందర్‌.. అక్కడ జమున హ్యాచరీస్‌ పేరుతో ఒక కోళ్లఫారాన్ని ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద హ్యాచరీ నిర్మించాలన్న లక్ష్యంతో దాన్ని విస్తరించుకుంటూ పోయారు. 2017లో మరో పది ఎకరాల భూమిని, ఆ తర్వాత మరో 50 ఎకరాలను చుట్టుపక్కల రైతుల నుంచి తీసుకున్నారు. ఇలా సేకరించిన భూమిని ఈటల రాజేందర్‌ తన భార్య జమున, కుమారుడు నితిన్‌రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారు. అసైన్డ్‌ భూములను రైతుల నుంచి తీసుకోవడమే ఇప్పుడు వివాదానికి మూలమయ్యింది. దీంతోపాటు అసలు ఈ కోళ్లఫారానికి వెళ్లడానికి దళితులు, బీసీలకు చెందిన భూమిలోంచి రోడ్డు వేశారు. ఇక్కడ రోడ్డు కోసమే పదుల ఎకరాల భూమిని రైతులు కోల్పోయారని తెలుస్తున్నది.

ఈటల మనుషులు యాంజల్‌ సుధాకర్‌రెడ్డి, సూరి తదితరులు ప్రతీ రోజు అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో దర్బార్లు నిర్వహించడం.. చుట్టుపక్కల ఉన్న రైతులను పిలవడం, తమ నోటికి వచ్చిన, ఇష్టం ఉన్న ధరలను చెప్పి కాగితాలపై సంతకాలు చేయించుకోవడం మొదలుపెట్టారని బాధితులు అంటున్నారు. హైదరాబాద్‌కు కేవలం గంట ప్రయాణ దూరంలో ఉన్న హకీంపేట, అచ్చంపేటల్లోని భూమిని ఎకరాకు రూ.2లక్షల చొప్పున కూడా సేకరించారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని ఇబ్బందులు పెట్టేవారని వాపోతున్నారు. ఒకటికాదు.. రెండుకాదు సుమారు 50 ఎకరాలను ఇలాగే సేకరించినట్టు గ్రామస్థులు చెప్తున్నారు. ఇక గ్రామంలోని దళితులకు 1994లో నాటి ప్రభుత్వం సుమారు వంద ఎకరాలకుపైగా భూమిని అసైన్‌మెంట్‌ కింద ఇచ్చింది. అందులో వారు వ్యవసాయం చేసుకునేవారు. వానకాలం పంట పండించుకునేవారు.

బడుగుల భూమిలో ఈటల పాగా

గుట్టకింద ఉన్న భూమిలో చేను చేసుకునేవారు. అయితే, ఇక్కడ జమునా హ్యాచరీస్‌ పేరుతో కోళ్లఫారం మొదలైన తర్వాత ఇక్కడి దళితులకు తమ భూముల్లోకి వెళ్లడానికి ఇబ్బందులు మొదలయ్యాయి. అసైన్‌మెంట్‌ భూములను తమకు అప్పగిస్తే సరి.. లేకపోతే మీరు మీ పొలాల్లోకి వెళ్లేందుకు వీల్లేదంటూ హ్యాచరీస్‌ నిర్వహిస్తున్న ఈటల రాజేందర్‌ మనుషులు స్థానికులను అడ్డుకోవడం మొదలుపెట్టారని బాధితులు చెప్తున్నారు. పలుమార్లు ఇక్కడి స్థానికులు ఎమ్మార్వో ఆఫీసుకు, పోలీసుస్టేషన్‌కు కూడా వెళ్లారు. కానీ, వారికి అక్కడ న్యాయం దక్కలేదు. కోళ్లఫారం యజమాని రాష్ట్రమంత్రి కావడం, ఆర్థికంగా ఉన్నవాడు కావడంతో ఎవ్వరూ జమునా హ్యాచరీస్‌ జోలికి వెళ్లలేదు. ఇక వీళ్లతో కొట్లాడటం తమవల్ల కాదని చాలించుకున్నారని, ఎవరికైనా దయ ఉంచి ఇస్తే తీసుకున్నారని, ఇవ్వకపోతే ఊరుకుండిపోయారని చెప్తున్నారు. ఇటీవల మంత్రి మనుషుల జులుం పెరిగిందని, తమ కోళ్లఫారానికి వెళ్లేదారిలో ఉన్న పొలాలను కూడా కబ్జాపెట్టారని సమాచారం. అదేంటని ప్రశ్నిస్తే దిక్కున్న దగ్గర చెప్పుకోండంటూ బెదిరించారని బాధితులు వాపోతున్నారు. వారు ఎవరికి చెప్పుకుందామన్నా వినేవారు లేకపోవడంతో దీంతో చివరకు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.

గౌడ్‌ల భూమికి ఎసరు
కోళ్లఫారానికి చుట్టూ ఉన్న భూమిలో సుమారు 30 ఎకరాలు కల్లుగీత కార్మికులకు, వారి సంఘానికి చెందినది ఉన్నది. దీని నుంచే రోడ్డు వేశారు. రోడ్డు వేస్తున్నట్టు కూడా సంబంధిత సంఘానికి, భూమి ఉన్న గౌడ కులస్థులకు చెప్పలేదు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినపుడు అక్కడ ఉన్న ఈటల రాజేందర్‌ మనుషులు బెదిరింపులకు దిగారని, దౌర్జన్యం చేశారని బాధితులు చెప్తున్నారు. దీంతో తాము నిస్సహాయులుగా ఉండిపోయామని అంటున్నారు. ఇక్కడే బండ కింద ముదిరాజ్‌లకు తరతరాలుగా భూములున్నాయి. అవన్నీ వారి పశువుల మేత కోసం దశాబ్దాల క్రితం ప్రభుత్వాలు కేటాయించాయి. వీటిని కూడా మంత్రి ఈటల మనుషులు ఆక్రమించుకున్నారని తెలుస్తున్నది.

భూముల కబ్జాపై సమగ్ర నివేదికకు సీఎం కేసీఆర్‌ ఆదేశం
మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే విషయంలో తనకు అందిన ఫిర్యాదుపై వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ద్వారా తక్షణం నివేదికను తెప్పించి అందజేయాలని పేర్కొన్నారు. అచ్చంపేట శివారులోని భూముల కబ్జాపై వస్తున్న ఆరోపణల్లో నిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా రాష్ట్ర విజిలెన్స్‌ డీజీ పూర్ణచందర్‌రావును ఆదేశించారు. సత్వరమే ప్రాథమిక నివేదికను అందించాలని, అనంతరం సమగ్ర దర్యాప్తు చేసి నివేదికను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

బడుగుల భూమిలో ఈటల పాగా

భూ రికార్డుల ప్రక్షాళనను వాడుకున్నారు
భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ఈటల రాజేందర్‌ జాగ్రత్తగా వాడుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసైన్‌మెంట్‌ భూములను తనవారిపై బదిలీ చేయించుకోవడం, సాదాబైనామాల పేరుతో అక్కడ ఉన్న భూముల పటా ్టమార్పిడి చేయించుకోవడం మొదలుపెట్టారని సమాచారం. గ్రామానికి చెంది, ఇక్కడ భూములున్నవారు తమ పాస్‌పుస్తకాల కోసం వెళ్తే వారికి పాస్‌పుస్తకాలు ఇవ్వని అధికారులు ఈటల రాజేందర్‌ మనుషులకు మాత్రం రెడ్‌కార్పెట్‌ వేసి స్వాగతం పలకడం గమనార్హం. ఎమ్మార్వోలను, ఇతర రెవెన్యూ అధికారులను మంత్రి కార్యాలయం నుంచి బెదిరించి పాస్‌పుస్తకాలను తెప్పించుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఇలా సుమారు 50 ఎకరాలకు సంబంధించిన పట్టాదార్‌ పాస్‌పుస్తకాలను మంత్రి అనుచరులు నేరుగా తెప్పించుకున్నట్టు సమాచారం. అలాగే, వివాదాల్లో ఉన్న భూములను కూడా కబ్జా పెట్టినట్టు తెలుస్తున్నది. ఎవరైనా వచ్చి నిలదీస్తే కోర్టు నుంచి డైరెక్షన్‌ తెచ్చుకోవాలని, కోర్టు చెప్తే తప్పుకొంటామని చెప్పి బెదిరించినట్టు సమాచారం.

ఇక రైతుల భూముల హద్దులను చెరిపివేయడంతోపాటు వాటి ఆనవాళ్లను పూర్తిగా మార్చేశారు. తమ భూమి ఎక్కడ అని ఎవరైనా వస్తే సర్వే చేయించుకోండని చెప్పి పంపించేసేవాళ్లని, సర్వే చేయించుకునేందుకు సిద్ధపడినా.. సర్వేయర్లు వచ్చేవారు కాదు.. భూమి ఎక్కడ ఉన్నదో రైతులకు చూపించేవాళ్లు కాదని చెప్తున్నారు. దీంతో ఏండ్లు గడిచిపోయేవి. మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ధర్మారెడ్డిపై కూడా ఈటల ఒత్తిడి తీసుకువచ్చారని తెలిసింది. ఇక్కడి అసైన్డ్‌ భూములను రెగ్యులరైజ్‌ చేయాల్సిందిగా స్వయంగా మంత్రి ఈటల రాజేందరే కలెక్టర్‌ను అడగటంతో చట్ట ప్రకారం రెగ్యులరైజ్‌ చేయడంసాధ్యం కాదని అప్పటి కలెక్టర్‌ ధర్మారెడ్డి తేల్చిచెప్పారు. ‘నువ్వు చేయకపోతే నేనే ప్రభుత్వం నుంచి చేయించుకుంటా’ అని ధర్మారెడ్డికి ఈటల చెప్పినట్టు తెలిసింది. వాస్తవానికి అసైన్డ్‌ భూములను భూమిలేని నిరుపేదలకు మాత్రమే రెగ్యులరైజ్‌ చేయాలి. పేదలు కాని వారికి భూమి ఇవ్వడం జిల్లాస్థాయిలో ఎమ్మార్వోలు, కలెక్టర్ల స్థాయిలో ఉండదు. అది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుంది. డబ్బు చెల్లించి రెగ్యులరైజ్‌ చేయాలి. ఇదే విషయాన్ని చెప్పి కలెక్టర్‌ ధర్మారెడ్డి తిరస్కరించారు. ఇదే విషయాన్ని ధర్మారెడ్డి మీడియాకు కూడా వెల్లడించారు.

బడుగుల భూమిలో ఈటల పాగా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బడుగుల భూమిలో ఈటల పాగా

ట్రెండింగ్‌

Advertisement