KTR | వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ఆత్మహత్య కాదు.. అది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండున్నరేళ్లుగా సీఎం రేవంత్ ఆర్టీసి కార్మికులకు చేస్తున్న తీరని ద్రోహాన్ని తట్టుకోలేకే శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారని అన్నారు.
ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు, తోటి కార్మికుల హక్కుల సాధనకు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ శంకర్ గౌడ్ పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా అనుమతించకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. పుట్టెడు దుఖంలో ఉన్న శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితోపాటు, బీఆర్ఎస్ నేతలు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలను నర్సంపేటలో అరెస్టుచేయడం చాలా దారుణమని అన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయడంతోపాటు, శంకర్ గౌడ్ కుటుంబసభ్యులు, ఆర్టీసి కార్మికుల విజ్ఞప్తిమేరకు ఆర్టీసి డిపో వద్ద నివాళులు అర్పించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కారు రాక్షసత్వం వల్ల కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే శంకర్ గౌడ్ గారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అన్నివిధాలా ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా, కనీసం సోయి లేని సర్కారు అంతులేని నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఉద్యమం నాటి దృశ్యాలు, ఆత్మబలిదానాలు చేసుకునే పరిస్థితులు చూస్తున్నామని మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ సవాలక్ష హామీలిచ్చిన రేవంత్ రెడ్డి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటికీ నెరవేర్చకపోవడంతోనే ఆర్టీసీ కార్మిక లోకం ఇవాళ తీవ్ర నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోందని కేటీఆర్ అన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలను ఇకనైనా మానుకుని ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి, ఇచ్చిన హామీలను, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు.
రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన సంఘటన తెలంగాణ చరిత్రలో ఓ చీకటి రోజుగా మిగిలి ఉంటుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఏకకాలంలో ఇన్ని బాధాకరమైన సంఘటనలు జరిగినా మానవత్వం లేని కాంగ్రెస్ సర్కారులో కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఆర్టీసీ కార్మిక సోదరుల్లారా.. దయచేసి మనోధైర్యాన్ని కోల్పోకండి. మీ పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నిరంకుశ కాంగ్రెస్ సర్కారు, ఈ అసమర్థ ముఖ్యమంత్రి మెడలు వంచి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కులను సాధించే వరకూ మనమంతా కలిసి సంఘటితంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.