కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కుంభకోణాల కుంభమేళా జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణిలో సైట్ విజిట్ స్కామ్, డీజిల్ స్కామ్, జిలెటిన్ స్టిక్స్ స్కామ్, సోలార్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్.. ఇలా స్కాముల లిస్ట్ చిత్ర గుప్తుడి చిట్టా కూడా సరిపోనంత పెద్దగా ఉన్నదని దుయ్యబట్టారు.
- మూడేండ్లలోనే సంస్థలో 10 వేల కోట్ల దోపిడీ
- సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు
- రెండుపార్టీలు కలిసి అదానీకో, అంబానీకో అమ్ముతయ్
- సింగరేణి స్కామ్‌లపై బీజేపీ నేతలు నోరుమెదపరేం?
- కమీషన్లు ముడుతున్నయా.. కప్పం కడుతున్నరా?
- కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను సహించలేకనే నాడు కోల్‌బెల్ట్ ప్రాంతం తుపాకులతో తిరగబడ్డది
- స్వరాష్ట్రం కోసం కేసీఆర్ జెండా ఎత్తి నిలబడితే ఇదే సింగరేణి గడ్డ ఆయనకు అండగా నిలబడింది
- కార్మిక గర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్
- సర్కార్‌పై మర్లవడి కార్మిక హక్కులు సాధిస్తామని హామీ
నమ్మించి ముంచిన కాంగ్రెస్‌పై సింగరేణి కార్మికులు కదంతొక్కారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖనిలో నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ సభకు పోటెత్తారు. సభకు ఒకరోజు ముందుగానే ప్రభుత్వం లాభాల వాటా ప్రకటించినా లెక్క చేయకుండా కేటీఆర్ మీటింగ్‌కు కదలివచ్చారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణిని అవినీతిమయంగా మార్చడం, కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేయడం, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, సంస్థ ప్రైవేటీకరణకు కుట్రలు చేయడం, వంటి అంశాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించగా, ఆయనతో గొంతు కలుపుతూ ‘సంస్థను నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ సర్కార్‌ను వదిలిపెట్టేది లేదు’ అంటూ నల్లసూర్యుడు సింహగర్జన చేశారు.
సింగరేణి బొగ్గును బుక్కిన బకాసురుడెవరు?.. బొగ్గును మాయం చేసిన మాయల ఫకీరెవరు?.. సింగరేణి కోల్‌ను గోల్మాల్ చేస్తున్న దొంగెవరు? .. సిరుల గనిని స్కామ్‌ల ఖనిగా మార్చిన దుర్మార్గుడెవరు?.. మూడేండ్లలో సింగరేణిలో బొగ్గు నిక్షేపాలు తగ్గినయా?.. కార్మికుల కష్టం తగ్గిందా? మరి బొగ్గెందుకు తగ్గింది?
– ధ్వజమెత్తిన కేటీఆర్

కరీంనగర్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కుంభకోణాల కుంభమేళా జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణిలో సైట్ విజిట్ స్కామ్, డీజిల్ స్కామ్, జిలెటిన్ స్టిక్స్ స్కామ్, సోలార్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్.. ఇలా స్కాముల లిస్ట్ చిత్ర గుప్తుడి చిట్టా కూడా సరిపోనంత పెద్దగా ఉన్నదని దుయ్యబట్టారు. ఇప్పటికే ట్రాన్స్‌కోలో 24శాతం వాటాను ప్రైవేట్ అప్పగించేందుకు ద్వారాలు తెరిచిన రేవంత్ సర్కార్, ఇక సింగరేణిని కూడా ఏ అదానీకో, అంబానీకో అప్పజెప్పి ప్రైవేట్‌పరం చేయాలని కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం రాత్రి సింగరేణి కార్మిక గర్జన సభలో కేటీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వరాజ్య సాధన కోసం ఆనాడు సింగరేణి చేసిన పోరాటాలు త్యాగాలను గుర్తుచేస్తూనే.. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణిలో జరిగిన అభివృద్ధిని కార్మికులకు వివరించారు.
ఇదే సమయంలో మూడేండ్లు కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, కార్మికులకు జరుగుతున్న అన్యాయం, సింగరేణిని ప్రైవేటీకరణ కుట్రలు, వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నా సీబీఐ విచారణ చేయించకుండా బీజేపీ కొనసాగిస్తున్న చీకటి ఒప్పందం, తదితర అంశాలపై కార్మిక లోకానికి వివరించి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని రుజువులతో వివరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే సింగరేణి ప్రైవేట్ బలిపీఠంపై ఉన్నదని పేర్కొన్నారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆగడాలు, దోపిడీకి తెరపడి, సింగరేణి తిరిగి సిరుల గనులుగా మారాలంటే కేసీఆర్ ఒక్కరే శ్రీరామ రక్ష అని స్పష్టంచేశారు. కార్పొరేట్ గద్దల నుంచి కోడి తన పిల్లలను రక్షించుకున్నట్టు ప్రైవేట్‌రంగ సంస్థలను కాపాడుకున్నది కేసీఆర్ ఒక్కరేనని, ఆయనతోనే సింగరేణికి భద్రత ఉంటుందని తేల్చిచెప్పారు. అందుకే భవిష్యత్తులో ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ను గెలిపించాలని కార్మిక లోకానికి కేటీఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఉత్పత్తిలో.. ఉద్యమాల్లో మొనగాళ్లు మీరే..
సింగరేణి కార్మికులకు బొగ్గు ఉత్పత్తి మాత్రమే కాదు.. ఉద్యమాలు కూడా ఉత్పత్తి చేయగలరని కేటీఆర్ పేర్కొన్నారు. ‘చరిత్ర నిండా కార్మికుల కష్టం ఉన్నది. నల్లబొగ్గుకు నెత్తురు అద్ది ప్రాణాలు కోల్పోయిన వాళ్లు ఉన్నరు. చీకటి గుహల్లో రక్త తర్పణం చేసిన వాళ్లు ఉన్నరు. ఎన్నో త్యాగాలు చేసిన కార్మిక కుటుంబాలు నా కంటే మీకే బాగా తెలుసు. చావుతో సావాసం చేసే కార్మికులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా అంటే.. అది మన సింగరేణిలోనే ఉన్నారని గర్వంగా చెప్పుకోవచ్చు.. మీకు బొగ్గు ఉత్పత్తి చేయడమే కాదు.. ఉద్యమాలు ఉత్పత్తి చేయడమూ తెలుసు.. మీ అందరికీ తెలుసు ఉత్పత్తిలో మొనగాళ్లు మీరు.. ఉద్యమాల్లో కూడా మొనగాళ్లు మీరు. కేసీఆర్ పిలుపు ఇస్తే 35 రోజుల పాటు ఒకసారి, 7రోజుల పాటు మరోసారి మొత్తం 42రోజుల పాటు ఒక్క పెళ్ల రాకుండా మీరు తిరుగబడితే.. దక్షిణాది రాష్ర్టాలు మొత్తం చిమ్మ చీకట్లో ఉన్న సంగతి ఎవ్వరూ మర్చిపోలేరు’ అని చెప్పారు. నాడు కేసీఆర్ జంగ్ సైరన్ ఊదితే సింగరేణి గడ్డ అండగా ఉన్నదని గుర్తుచేశారు.

చైతన్యం ఉన్న గడ్డ ఇది..
‘కష్టపడ్డాం.. అందరం సమిష్టిగా పోరాడినం. కేసీఆర్ నాయకత్వంలో ఒకవైపు మీరు.. మరొక వైపు తెలంగాణ సబ్బండ వర్ణం కలిసి కట్టుగా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఇక్కడి ప్రజల ఆశీర్వదిస్తే ఒక సామాన్య ఉస్మానియా కాలేజీ విద్యార్థి, దళిత బిడ్డ బాల్క సుమన్‌ను పెద్దపల్లి పార్లమెంట్ నుంచి, ఒక సింగరేణి కార్మికుడు కొప్పుల ఈశ్వర్‌ను రామగుండం నుంచి గెలిపించిన చైతన్యం మీదని చెప్పారు.
కేసీఆర్ దిగిపోయి మూడేండ్లు అవుతున్నది. 7,778 మెగావాట్ల నుంచి 24వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి స్థాపితానికి అంటే దాదాపు మూడున్నర రెట్లు కెపాసిటీ పెంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగిస్తే ఏం జరుగుతున్నది. ఇప్పుడు రాష్ట్రంలో కరెంట్ పోయింది. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే రాష్ట్రం అంధకారమైతదని కేసీఆర్ ఆనాడే చెప్పారు. మోసపోతే గోస పడతరని ఇదే రామగుండంలో చెప్పారు. ఆ ముసలి నక్క కాంగ్రెస్‌ను నమ్మకండి.
ప్రపంచంలో ఎక్కడైనా కార్మికులు బోనస్ కోసం ఉద్యమాలు చేస్తరు.. జీతాల కోసం ఉద్యమాలు చేస్తరు.. హక్కుల కోసం ఉద్యమాలు చేస్తరు.. కానీ తెలంగాణ కోసం తమ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన కార్మికులు గోదావరిఖని బిడ్డలని గర్వంగా చెబుతున్నా. మీకున్న రాజకీయ చైతన్యం దేశంలో ఏ కార్మిక వర్గానికి కూడా లేదంటే అతిశయోక్తి కాదు.
– బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కేసీఆర్ పాలనలో నిరంతర వెలుగులు
పదేండ్ల కేసీఆర్ పాలనలో సింగరేణి ఒక వెలుగు వెలిగిందని కేటీఆర్ తెలిపారు. నవరత్న, మహారత్న కంపెనీలకు దీటుగా కార్మికులు కసితో పనిచేసి బొగ్గు ఉత్పత్తి చేస్తే రెప్పపాటు కూడా అంతరాయం లేకుండా అన్ని వర్గాలకు బ్రహ్మాండంగా 24గంటల పాటు కరెంటు ఇచ్చిన దేశంలో ఒకే ఒక నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. కానీ ఇవాళ పరిశ్రమలకు పవర్ హాలిడేలు.. రైతుల మోటర్లు కాలిపోవడం.. లో వోల్టేజీ సమస్యలు.. కరెంట్ రాదు.. ఇండ్లల్ల బుగ్గలు వెలుగయి.. ఎండకాలం పడుకుంటేమంటే ఫ్యాన్ కూడా తిరుగని పరిస్థితి దాపురించిందని కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోయి, రైతులు వలవలా ఏడుస్తున్న దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. తాము కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని ఆదిలాబాద్‌లో రైతులు తమ చెప్పులతో తామే కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలా అనేక మంది బాధపడుతున్న దృశ్యాలు నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయని చెప్పారు.

కరెంట్ అడిగితేబొగ్గు లేదంటరా?
‘కేసీఆర్ హయాంలో యాదాద్రి పవర్‌స్టేషన్ కట్టినం.. మిర్యాలగూడ వద్ద దామెరచెర్లలో కట్టినం. 4వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్పి కేంద్రాన్ని కట్టినం. ఇవాళ అన్ని కేంద్రాలను పక్కన పెట్టారు. 4వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో 400 మెగావాట్లు కూడా ఉత్పత్తి కావడం లేదు. ఎందుకని జగదీశ్‌రెడ్డి వెళ్లి అడిగితే సింగరేణి బొగ్గు ఇవ్వడం లేదని నెపం నెడుతున్నారు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బొగ్గు ఎందుకు ఇవ్వడం లేదని కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో సింగరేణి హెడ్ క్వార్టర్స్ వెళ్లి అడిగితే ముఖ్యమంత్రే తమకే రూ.60 వేల కోట్లు బాకీ పడ్డారని, అవి ఇవ్వకుండా నెపం నెడుతున్నారని లోలోపల కుమిలిపోతున్నారని చెప్పారు.
గోదావరిఖనిలో నిలబడితే చాలా గర్వంగా అనిపిస్తున్నది. గోదావరిఖని బిడ్డ.. తమ్ముడు శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ అనే సినిమా తీసిండు. ఇందులో కేసీఆర్ పాత్ర ఉన్నది అంటే ఆసక్తిగా చూడటానికి పోయిన. ఈ గడ్డ గొప్పతనం, ఇక్కడి నీళ్ల గొప్పదనం ఏందంటే.. అణచివేయబడ్డ జాతి ఎట్ల తిరుగబడతదో, ఆ జాతి నాయకుడు కదిలి వచ్చిననాడు ఎట్ల నిలబడతదో చూపించిన అద్భుతమైన సినిమా అది. అట్లాంటి గొప్పతం గోదావరిఖని నేలలో ఉన్నది.
– కేటీఆర్
బొగ్గు బకాసురుడు ఎవరు?
సింగరేణి బొగ్గు లేకపోతే.. కార్మికులు ఉత్ప త్తి చేస్తున్న బొగ్గంతా ఎక్కడపోతున్నది.. ఎక్కడ మాయమైందని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ బొగ్గును బుక్కిన బకాసురుడు ఎవ రు? ఈ బొగ్గును మాయం చేసిన మాయల ఫకీరు ఎవరు? అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బొగ్గు కొరత లేదు.. కరెంట్ కొరత లేదు. నీళ్లకు కొరత లేదు. పదేండ్లు బ్రహ్మాండంగా నడిచిన సింగరేణి ఇప్పుందుకు ఈ పరిస్థితిలో ఉన్నదో ఆలోచించాలి’ అని కోరారు. సింగరేణి కోల్‌ను గోల్మాల్ చేస్తున్న దొంగ ఎవరు? కోల్మాల్ గోల్మాల్ దొంగ ఎవరు? అని కేటీఆర్ ప్రశ్నించగా సభికుల నుంచి ‘రేవంత్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డి’ అంటూ నినాదాలు వినిపించాయి.

దివాలాకోరు కాంగ్రెస్ వల్లే సింగరేణి దివాలా
దివాలాకోరు కాంగ్రెస్ పాలనలో సింగరేణి దివాలా తీసే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘బీఆర్ఎస్ అధికారం కోల్పోయేనాటికి 2023 డిసెంబర్లో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి 70 మిలియన్ టన్నులు.. ఇదొక సూపర్ రికార్డు. 2025-26లో కేవలం 58 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే. రాను రాను పెరుగాలా.. తగ్గాలా? 70 మిలియన్ టన్నుల నుంచి 58 మిలియన్ టన్నులకు పడిపోయింది. సింగరేణిలో ఉత్పత్తి పడిపోవడానికి కారణం కార్మికుడు కాదు.. కాంగ్రెసోళ్లే కారణం. ఓపెన్ కాస్టుల్లో ఓబీ టెండర్లలో ఆలస్యం కావడం వల్లనే ఉత్పత్తి తగ్గింది. టెండర్లు ఆలస్యం అవుతున్నయి. ఎందుకంటే వీళ్ల వాటాల లెక్కలు తేలడం లేదు.. ఈ నిబంధన భారత దేశంలోని కోల్ ఇండియాలోగానీ, నవరత్న, మహారత్న సంస్థల్లోగానీ ఎక్కడా లేదు.
కానీ ఈ సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ అనే కుంభకోణానికి ప్రధాన సూత్రధారి ఎవరో కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన బామ్మర్ది సృజన్‌రెడ్డి. వాళ్లిద్దరు కలిసి కాంట్రాక్టర్లను బెదిరించి, వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడటం వల్లనే ఓపెన్ కాస్ట్ టెండర్లు ఆలస్యం అయ్యాయి’ అని స్పష్టంచేశారు. ‘సింగరేణిలో నైనీ కుంభకోణాన్ని తాను అడ్డుకోవడం వల్ల ప్రభుత్వానికి రూ.30 కోట్లు మిగిలాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.. మరీ నైనీ కుంభకోణం చేసి ఇంత సొమ్ము మింగుతామని అనుకున్నదెవరు?’ అని కేటీఆర్ ప్రశ్నించగా రేవంత్‌రెడ్డి.. రేవంత్ రెడ్డి అని సభికుల నుంచి నినాదాలు వినిపించాయి.
తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు కేసీఆర్‌ను యాదిజేసుకుంటున్నది. ఎందుకంటే కేసీఆర్ ఏనాడూ లొంగి పోలేదు. ఆత్మగౌరవంతో నిలబడి అణచి వేయబడిన జాతికి స్వాతంత్య్రం తెచ్చారు. తెలంగాణ గళం, తెలంగాణ బలం ఒకడే ఒక్కడు కేసీఆర్. ఒకటే ఒక జెండా గులాబీ జెండా.. సంస్థను కాపాడుకుందాం.. రామగుండంలో గులాబీ జెండాను ఎగరేద్దాం.. భవిష్యత్తులో విజయయాత్ర రామగుండం నుంచే మొదలు పెడదాం.
– కేటీఆర్

రేవంత్ స్కామ్‌పై మోదీ మౌనం
రేవంత్‌రెడ్డి ఏ స్కామ్ చేసినా ప్రధాని మోదీ మౌనంగా ఉంటున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇక్కడ ఏఐటీయూసీ గుర్తిం పు సంఘం ఉన్నా వాళ్లకు అడిగే ధైర్యం లేదని పేర్కొన్నారు. ‘అందుకే కాంగ్రెస్ అరాచకం, రౌడీయిజం, వేధింపులు భరించ లేకనే కోల్‌బెల్ట్ తుపాకులతోనే తిరుగబడ్డది. సింగరేణి సమాఖ్య పేరిట ఆ రోజు శతుజ్ఞులై గర్జించింది ఇదే సింగరేణి గడ్డ. మళ్లీ కాంగ్రెస్ దోపిడీని తరిమికొట్టడానికి మీకున్న ఒకే ఒక అస్త్రం, మీకున్న ఒకే ఒక నాయకత్వం కేసీఆర్ మాత్రమేనని మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది లాభాల్లో వాటా పెంచుకుంటా పోయినం. కేసీఆర్ రాక ముందు లాభాల్లో వాటా 16శాతం ఉండే. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 32 శాతం చెల్లించాం. మళ్లీ కాంగ్రెస్ వచ్చాక ఏం జరిగింది. 33 శాతం అని ఇచ్చింది 16 శాతం రెండో సంవత్సరం 34 శాతమని 12శాతమే ఇచ్చారు. ఇప్పుడు గులాబీ దండు గర్జిస్తేనే దెబ్బకు దయ్యం దిగివచ్చి దసరాకు లాభాల వాటా ఇస్తున్నరు. ఇది కూడా సరిగ్గా ఇవ్వకుంటే సింగరేణి బెల్ట్‌లో ఉండే ప్రతి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తం.

ప్రతి మంత్రి ఇంటిని ముట్టడిస్తం. మీకు అన్యాయం జరిగితే వదిలి పెట్టమని చెబుతున్నా’ అని చెప్పారు. సభలో మాజీ స్పీకర్ మధుసూదనా చారి, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధూకర్, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, పోలీస్ హౌసింగ్ బోర్డ్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, కటారి రేవతి, రామగుండం మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, పెద్దపెల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ మమతారెడ్డి, బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీశ్ రెడ్డి, కౌశిక్ హరి మూల విజయ రెడ్డి, నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, పీటీ స్వామి, టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రామమూర్తి, వడ్డేపల్లి శంకర్ నూనె కొమురయ్య, చెల్పూరి సతీశ్, అంతర్గాం పాలకుర్తి రామగుండం కార్పొరేషన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలు..
బీజేపీ కాంగ్రెస్ దొందూ దొందేనని.. ఈ రెండు పార్టీలనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘సింగరేణిలో కుంభకోణం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాస్తే ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసిండు. సింగరేణిలో ఏదో జరిగిందట.. విచారణ జరుపమని కోరారు. దొంగా చీకటి ఒక్కటై ఒకరినొకరు కాపాడుకొనేందుకు సింగరేణిని ఇవాళ కొల్ల గొడుతున్నరు.’ అని విమర్శించారు. ఈ ప్రభుత్వం సింగరేణికి రూ.60 వేల కోట్లు బాకీ ఉన్నది. మూడేండ్ల నుంచి ఒక్కపైసా ఇవ్వలేదు.. ఇప్పటివరకు రూ.4.50 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశావని ఏం చేశారు.

రాహుల్‌గాంధీకి మాత్రం నెలనెలా ఈఎంఐ మాత్రం కడుతున్నడు.. కానీ సింగరేణికి ఇచ్చేందుకు పైసలు లేవా?’ అని నిలదీశారు. మూడేళ్ల నుంచి కమీషన్లు, పర్సంటేజీలు, దందాలు చేయడం తప్ప సింగరేణిని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. సింగరేణిలో ప్రతిపైసా కార్మికుడి చెమట.. నెత్తురు. ఇలాంటి సింగరేణితో ఆడుకుంటున్న రేవంత్‌రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు.దోపిడీ జరుగుతుంటే సింగరేణిలో 49శాతం వాటా ఉన్న కేంద్రం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు? మీకు కమీషన్లు ముడుతున్నందుకా.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

