హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తన అభిమాన నేత.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసేందుకు ఓ యువకుడు సాహసోపేత ప్రయాణం చేశాడు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లంకలపల్లికి చెందిన కిశోర్ లింగారెడ్డికి కేటీఆర్ అంటే ఎంతో అభిమానం! కేటీఆర్‌ను ఒక్కసారైనా కలువాలనేది అతడి కోరిక.. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అతడు డాలస్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాల సభకు కేటీఆర్ వస్తున్నారని, అక్కడ కలవాలని నిర్ణయించుకున్నాడు.
అమెరికాలోని కనెక్టికట్ నుంచి అనేక రాష్ర్టాలను చుట్టేసి, రజతోత్సవ సంబురాల ఆవశ్యకత గురించి ప్రచారం చేస్తూ కేసీఆర్-టీఆర్ఎస్ అనే ప్రత్యేక ప్లేట్ వేయించుకొని కారులో బయలుదేరాడు. 3,218 కిలోమీటర్లు (2000 మైళ్లు) ప్రయాణించి డాలస్ చేరుకున్నాడు. బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాల్లో పాల్గొని కేటీఆర్‌తో ఫొటో దిగాలనే తన చిరకాల కోరికను తీర్చుకోనున్నట్టు కిశోర్ తెలిపాడు.