హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ):‘కేంద్మ్రే పూంజీపతి సర్కార్ జానా హై.. ప్రజాపతికా సర్కార్ ఆనా హై (పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే ప్రభుత్వం కేంద్రంలో కొనసాగుతున్నది. ప్రజాభీష్టం మేరకు పాలించే సర్కారు రావాలి)’ అని హర్యానాకు చెందిన భారతీయ కిసాన్ యూనియన్ చడౌనీ జాతీయ అధ్యక్షుడు గుర్నాంసింగ్ అభిలషిస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి ప్రస్తుతం కాంగ్రెస్కు లేదని, దేశంలో కొత్త రాజకీయశక్తి రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్ష వినిపిస్తున్న నేపథ్యంలో గుర్నాంసింగ్ ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ వివరాలు..
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావటాన్ని మీరెలా చూస్తారు?
దేశ ప్రజల హితాన్ని కోరే కేసీఆర్ లాంటి నేత జాతీయ రాజకీయాల్లోకి వస్తే మాలాంటి వాళ్లం ఎంతో సంతోషిస్తాం. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే అద్భుతం. అటువంటిది కేసీఆర్ పట్టువదలకుండా పోరాటం చేసి, తన రాష్ట్ర ప్రజానీకం చిరకాల వాంఛను సాకారం చేశారు. ఏంచేస్తే ప్రజలు బాగుపడతారని ప్రజాపోరాట అనుభవాన్ని మథించి, విధానాలకు రూపకల్పనచేసి, పకడ్బందీగా అమలు చేశారు. దీంతో తక్కువ కాలంలోనే తెలంగాణను కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిపారు. ఇటువంటి నేత జాతీయ రాజకీయాల్లో తప్పకుండా విజ యం సాధిస్తారనే విశ్వాసం ఉన్నది. బీజేపీ ప్రజావ్యతిరేకిగా ముద్రపడింది. ఆ పార్టీని నిలువరించే శక్తిని కాంగ్రెస్ పోగొట్టుకున్నది.
ప్రజాకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్, బీజేపీ ఫెయిలయ్యాయా?
కాంగ్రెస్ పార్టీ సరైన నాయకత్వం లేక ఇబ్బంది పడుతున్నది. ఉన్న నాయకత్వం దేశ ప్రజల విశ్వాసాలను, వారి ఆకాంక్షలను పట్టించుకోవటం లేదు. 2014 నుంచి ఇప్పటిదాకా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నది. ప్రజలు, వివిధవర్గాలు ఎవరికి వారు ఉద్యమించారే తప్ప కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఉద్యమించిన దాఖలాలు లేవు. అంతెందుకు కేంద్రం మూడు రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఈ దేశానికి రైతుగొంతుకగా నిలబడాల్సిన కాంగ్రెస్ కేవలం ప్రకటనలకు పరిమితమైంది. కేంద్రం మీద ఒత్తిడి తేవటానికి ప్రయ త్నం చేయలేదు. ఈ ఏనిమిదేండ్ల కాలంలో ఇటువంటి అనేక ఉదాహరణలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలే అయినా అవి ప్రస్తుతం జాతీయ స్థాయిలో విధానాల్లేని పార్టీలుగా..అందరినీ కలుపుకొని పోయే సంస్కృతి లోపించిన పార్టీలుగా మిగిలిపోయాయి.
బీజేపీవారు గుజరాత్ మాడల్ దేశానికి అవసరం అంటున్నారు? మరి మీరేమంటారు ?
గుజరాత్ అసలు మాడలే కాదు. దేశప్రజల వికాసం కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పండి. గుజరాత్ మాడల్, కేంద్రం మాడల్ రెండూ ఒక్కటే. అది పూంజీపతి (పెట్టుబడిదారీ, కార్పొరేట్) మాడల్. ఇప్పుడు దేశమంతా తెలంగాణ మాడల్ కావాలని మేం కోరుతున్నాం. ఇందుకు బలమైన కారణం ఉన్నది. మేం అందరిలాగే ‘వాళ్లు (తెలంగాణవాళ్లు) తమకు తాము ఎక్కువ చెప్పుంటారు’ అనుకున్నాం. కానీ, తెలంగాణలో పర్యటించాక అర్థం అయింది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులతో మాట్లాడినప్పుడు, ఇరిగేషన్ ప్రాజెక్టులను చూసినప్పుడు చాలా విషయాలు తెలిశాయి. చిన్న రాష్ట్రమైన తెలంగాణను చూసి నేర్చుకోవటానికి ఎంతో ఉన్నది. కేసీఆర్ లాగా మనసుతో పనిచేసే నాయకుడు దేశానికి ఉంటే ఎంత బాగుండునో అనిపించింది. ‘కేంద్మ్రే పూంజీపతి సర్కార్ జానా హై..ప్రజాపతి సర్కార్ ఆనా హై’ అని అప్పుడే అనుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తానని నిర్ణయం తీసుకోవటం మంచిపరిణామం. ఆయన నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం.
దక్షిణభారత నాయకత్వాన్ని ఉత్తర భారతం అంగీకరించదా?
ఏ తో గలత్ హై (అలా అనడం సరికాదు). నాయకత్వం పార్టీల్లోంచి రాదు. ప్రజల మనసుల్లోంచి వస్తుంది. ప్రజాభిప్రాయాల నిర్వహణలోంచి వస్తుంది. అది ఉత్తర భారతం అయినా, దక్షిణ భారతం అయినా ఒక్కటే. పీవీ నరసింహారావు దక్షిణాది నుంచి రాలేదా? ఎంతోమంది రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు సౌత్ నుంచి వచ్చినవాళ్లే కదా! అన్యాయాన్ని ఎదిరించి..ప్రజలకు మేలుచేసే నాయకుడు ఎక్కడి నుంచి వచ్చినా మంచిదే.
బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎదుర్కోవడంలో కేసీఆర్ విజయం సాధిస్తారా?
కేసీఆర్ ఎదుర్కోరని మీరెలా అంచనా వేస్తారు? కేసీఆర్ తప్పకుండా బీజేపీని ఎదుర్కోగలరని నా అంచనా. కేంద్రం మూడు సాగు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు కేంద్రా న్ని కేసీఆర్ నిలదీశారు. రైతు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఆ తరువాత ప్రతీ అంశంలో కేంద్రం తీసుకొనే ప్రజావ్యతిరేక విధానాలను కేసీఆర్ ఎండగట్టారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రభుత్వాధినేత మాట్లాడని విధంగా కేసీఆర్ మాట్లాడారు. ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు, ప్రజలకు మేలు చేయాలని ఆలోచించే నాయకుడు మాత్రమే ఇలా చేస్తాడని మాకు అర్థమైంది. ‘బెదిరింపులు కాదు.. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి’ అని ఇప్పటివరకు ఒక్క కేసీఆరే సవాల్ విసిరారు. ఇట్లా అనేక ఉదంతాలున్నాయి. మేలుచేసే నాయకుడు రావాలని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. అది కేసీఆర్ అయితే మంచిదే కదా!