పెన్నాకు కాళోజీ పురస్కారం

- రేపు రవీంద్రభారతిలో అవార్డు ప్రదానం
- కవిగా, విమర్శకునిగా ప్రసిద్ధి
- హైకూ ప్రక్రియకు ప్రాచుర్యం కల్పించిన సాహితీవేత్త
- గజళ్ల ప్రక్రియలోనూ కృషి
- నాలాంటి సామాన్యుడికి అవార్డు ఇవ్వడం ఆనందం: పెన్నాశివరామకృష్ణ
హైదరాబాద్, సెప్టెంబర్ 7
(నమస్తే తెలంగాణ): సాహితీవేత్త పెన్నా శివరామకృష్ణను రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ పురస్కారానికి ఎంపిక చేసింది. రవీంద్రభారతిలో గురువారం నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులో భాగంగా రూ.1,01,116 నగదు బహుమతి, జ్ఞాపికతో ఆయనను సత్కరించనున్నది. తెలంగాణ ఉద్యమానికి ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ఇచ్చిన స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయన జయంతి రోజైన సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం సాహిత్యంలో విశేష కృషి చేసినవారికి ఈ అవార్డును ఇస్తున్నది. 2021 సంవత్సరానికి నిపుణుల ప్రత్యేక కమిటీ ప్రతిపాదనలు, సీఎం కేసీఆర్ సూచన మేరకు పెన్నా శివరామకృష్ణను ఎంపిక చేశారు.
విశిష్ట ప్రక్రియల్లో విశేష కృషి
శివరామకృష్ణ పూర్తి పేరు పెన్నా వేంకట శివరామకృష్ణ శర్శ (పీవీఎస్ఆర్కే శర్మ). నల్లగొండ జిల్లా దుగునవల్లి గ్రామంలో 1960, ఫిబ్రవరి 2న జన్మించారు. హైకూలు, గజళ్ల వంటి విశిష్ట ప్రక్రియల్లో విశేష కృషి జరిపారు. 1991లో ‘రహస్య ద్వారం’ పేరుతో తొలి తెలుగు హైకూ కవిత్వ సంపుటిని తీసుకొచ్చారు. చినుకుల చిత్రాలు, సులోచనాలు అనే మరో రెండు హైకూ సంకలనాలు ప్రచురించారు. వివిధ భాషల్లోని హైకూలను తెలుగులోకి అనువదించారు. నిశ్శబ్దం నా మాతృక, అలల పడవల మీద కవితా సంపుటాలు, జీవనది (కావ్యం), సల్లాపం (గజళ్ళ సంపుటి), శిశిరవల్లరి- (గజళ్ళు), దీపఖడ్గం కవితా సంపుటిని ప్రచురించారు. దీపఖడ్గం సంపుటికి 2010లో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది. తెలంగాణ రుబాయీలు, త్రిపద (లఘు కవితలు) ఈ-బుక్, అశ్రుధార-రుబాయీలు ప్రచురించారు. ఆయన కృషికి పలు అవార్డులు లభించాయి.
నాలాంటి సామాన్యుడికి ఇవ్వడం ఆనందం
ఈ పురస్కారానికి నాకంటే అర్హులైన వారు కనీసం ఒక అరడజను మంది ఉన్నారు. నన్ను ఎంపిక చేసిన కమిటీకీ ధన్యవాదాలు. కాళోజీ అవార్డు నాకు దక్కడం నా జీవితంలోనే అత్యంత ఆనందకరమైన విషయం. నాలాంటి సామాన్యుడిని గుర్తించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. – పెన్నా శివరామకృష్ణ
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
సీఎంకేసీఆర్కు సాహిత్యం , కవులు, కళాకారులపై ఉండే గౌరవానికి ఏటా ఇస్తున్న ప్రజాకవి కాళోజీ, మహాకవి దాశరథి పురస్కారాలు ఒక ఉదాహరణ. ఒక మంచి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న సీఎంకు ధన్యవాదాలు.
- వీ శ్రీనివాస్గౌడ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

