హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ఐఐటీ ఎంట్రన్స్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు సత్తాచాటారు. క్యాటగిరీ వారి ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులిద్దరు టాపర్లుగా నిలిచి.. మరోసారి తెలుగు రాష్ర్టాల ఖ్యాతిని పెంచారు. ఈడబ్ల్యూఎస్ ఆలిండియా టాపర్‌గా వంగాల అజయ్‌రెడ్డి, ఓబీసీ ఎన్సీఎల్ ఆలిండియా టాపర్‌గా డీ జ్ఞానరుత్విక్ సాయిలు నిలిచారు. ఐఐటీల్లోని బీటెక్ కోర్సుల్లో సీట్ల భర్తీకి మే18న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల ఫలితాలను సోమవారం ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది. మొత్తం 360మార్కులకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో ఈ పరీక్ష నిర్వహించారు.
ఈ ఫలితాల్లో ఐఐటీ ఢిల్లీ జోన్ విద్యార్థి రజిత్ గుప్తా మొత్తం 360 మార్కులకు గానూ 332 మార్కులు సాధించి, కామన్ ర్యాంక్ లిస్ట్ (సీఆర్ఎల్)లో టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఐఐటీ ఖరగ్‌పూర్ జోన్‌కు చెందిన దేవదత్త మాఝీకి 312 మార్కులు రాగా, సీఆర్ఎల్లో 16వ ర్యాంక్ లభించింది. 116మంది విదేశీ విద్యార్థులు ఈ పరీక్ష రాయగా, వీరిలో 13మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థి అర్నవ్ సింగ్ 319మార్కులతో ఆలిండియా 9వ ర్యాంకుతోపాటు, హైదరాబాద్ జోన్ టాపర్‌గా నిలిచాడు. అలాగే వడ్లమూడి లోకేశ్ 317 మార్కులలో ఆలిండియా 10వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. అనిరుధ్‌రెడ్డి ఆలిండియా 20, కే రసజ్ఞ హైదరాబాద్ జోన్ మహిళా టాపర్తోపాటు, ఆలిండియా 78వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. అలాగే టాప్-100 ర్యాంకర్లలో 31మంది బాంబే జోన్‌కు, 31మంది ఢిల్లీ జోన్‌కు, 23మంది ఐఐటీ హైదరాబాద్ జోన్‌కు, నలుగురు ఐఐటీ కాన్పూరు జోన్‌కు, ఐదుగురు ఖరగ్‌పూర్ జోన్‌కు, ఆరుగురు రూర్కీ జోన్‌కు చెందిన వారు ఉన్నారు.
హైదరాబాద్ జోన్ నుంచి అత్యధికంగా..
ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1.87లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 1.80లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 54,378 మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వారిలో 44వేల మంది అబ్బాయిలు ఉండగా, అమ్మాయిలు కేవలం 9,404 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఐఐటీ హైదరాబాద్ జోన్ నుంచి రికార్డుస్థాయిలో విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. మొత్తం ఏడు జోన్లు ఉండగా, హైదరాబాద్ జోన్ నుంచి ఈసారి రికార్డుస్థాయిలో 12,946 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలున్నాయి. కాగా, అడ్వాన్స్‌డ్‌లో టాప్-10, టా ప్-100లోనూ తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ నుంచి టాప్10లో ఇద్దరు, టాప్100లో 23మంది, టాప్200లో 57మంది విద్యార్థులు ఉండటం విశేషం. టాప్ 300లో 78 మంది, టాప్ 400లో 116, టాప్ 500లో 136 ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులున్నారు.
గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ అడ్వాన్స్డ్-2025 ఫలితాల్లో ఎస్సీ, బీసీ గురుకుల విద్యార్థులు ప్రతిభకనబర్చారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) నుంచి 97మంది విద్యార్థులు ఐఐటీకి అర్హత సాధించారు. సొసైటీ నుంచి 492మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 97 మంది డైరెక్ట్ ర్యాంకులు, మరో 132మంది విద్యార్థులు ప్రిపరేటరీ ర్యాంకులకు సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూసి ర్యాంకులు సాధించిన విద్యార్థులను, కృషి చేసిన అధ్యాపకులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, సొసైటీ సెక్రటరీలు బడుగు సైదులు, అలుగు వర్షిణి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ప్రత్యేకంగా అభినందించారు.
ఈసారి నిరాశ..!
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఈసారి తెలంగాణకు నిరాశజనకమైన ఫలితాలొచ్చా యి. ఈఏడాది టాప్ -5లో ఒక్కరు మన వి ద్యార్థులు లేకపోవడం గమనార్హం. జేఈఈ మెయిన్‌లో 300లకు మూడు వందల మా ర్కులు సాధించిన వారు అడ్వాన్స్‌డ్‌లో మా త్రం వెనుకబడ్డారు. వాస్తవానికి కొంతకాలం గా మన విద్యార్థులు టాప్ ర్యాంకులను సా ధిస్తూ వస్తున్నారు. నిరుడు 2024లో సందేశ్ ఆలిండియా మూడో ర్యాంకును సొంతం చేసుకోగా, 2023లో వావిలాల చిద్విలాస్‌రెడ్డి మొదటి ర్యాంకు, 2022లో పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి ఆలిండియా రెండో ర్యాంకులతో సత్తాచాటారు. ఐఐటీల్లో 17వేలకు పైగా సీట్లు..ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభంకానున్నది. మొత్తం ఆరు విడుతల్లో సీట్లను భర్తీచేస్తారు. మంగళవారం నుంచే మొదటి విడుత ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఈనెల 14న మొదటి మొదటి రౌండ్, 21న రెండో రౌండ్, 28న మూడో రౌండ్, జూలై 4న నాలుగో రౌండ్, జూలై 10న ఐదో రౌండ్, జూలై 16న ఫైనల్ రౌండ్ సీట్లను కేటాయిస్తారు. ఈసారి ఐఐటీల్లో 17,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్ఐటీల్లో 24,229, ట్రిపుల్ ఐటీల్లో 8,546, గవర్నమెంట్ ఫండెండ్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్స్‌లో 9,402 చొప్పున సీట్లున్నాయి.