హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒంటెత్తు పోకడల్ని ప్రశ్నించిన వారిపై కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అదనపు బాధ్యతల నుంచి తొలగించింది. పలు పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జి బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పించారు. వీటిని ఇతర నేతలకు అప్పగించారు. గతంలో జగ్గారెడ్డి ఖమ్మం, వరంగల్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జిగా ఉన్నారు. తనను పార్లమెంటరీ స్థానాల బాధ్యతల నుంచి తప్పించడంపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మంగళవారం స్పందిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. ఇదిలావుండగా, పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డితో మొదటి నుంచి జగ్గారెడ్డి ఎడమొఖం పెడమొఖం ఉండడం తెలిసిందే.