Jagga Reddy : సీనియర్ నాయకుడు టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం బాధాకరమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం ఖాయమవ్వడంతో ఢిల్లీ నాయకత్వం చొరవ చూపి ఉంటే సమస్య పరిష్కారమయ్యేదని జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాంపులపై కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ వచ్చిన ఆయన గులాబీ జెండా కప్పుకోనున్న నేపథ్యంలో జగ్గారెడ్డి ఏఐసీసీ స్థాయిలో చర్చ అవసరమని పేర్కొన్నారు.
జగిత్యాల సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ వీడడంపై ఆ పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉన్న జీవన్ రెడ్డి పార్టీని వీడడం బాధాకరం అని పేర్కొన్నాడు. కీలక నేత దూరమవ్వడంపై స్పందించిన ఆయన అంతర్గతంగా ఏం జరుగుతుందో ఏఐసీసి స్థాయిలో చెక్ చేసుకొని ఉండాల్సింది అని తెలిపారు.

కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ తీరుతో అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డితో నేరుగా ఢిల్లీ నాయకత్వమే మాట్లాడి.. నేరుగా రంగం లోకి దిగి సమస్యను పరిష్కరించి ఉంటే బాగుండేది అని ఆయన వెల్లడించారు. అయితే.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని జగ్గారెడ్డి తెలిపారు. జీవన్ రెడ్డి పార్టీ మారడానికి గల కారణాలను బహిరంగగా మీడియాతో చెప్పలేమని.. అంతర్గతంగా పార్టీలో చర్చిస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు.