హైదరాబాద్, అక్టోబర్ (నమస్తే తెలంగాణ): వాయవ్య దిశ నుంచి వీచే చలిగాలులతో ఈఏడాది చలికాలం ఉష్ణోగ్రతలు 20డిగ్రీల కంటే తకువగా నమోదయ్యే అవకాశం ఉన్నదనిఅంచనా వేసినట్టు వాతావరణ శాస్త్ర వేత్తలు తెలిపారు. శీతల పరిస్థితులకు కారణమయ్యే లానినా తిరిగి రావడంతో ఈ సీజన్ మరింత తీవ్రమవుతుందని పేర్కొన్నారు. 2025 చివరినాటికి లానినా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నదని వెల్లడించారు. దీని వల్ల సాధారణం కంటే తకువ ఉష్ణోగ్రతలు, ఎకువగా చలిగాలులు సంభవించవచ్చని వెల్లడించారు. ఈ సహజ వాతావరణ మార్పు గత ఆరేండ్లల్లో ఏర్పడటం ఐదోసారి అని తెలిపారు.
లానినా అంటే..
“లానినా” అనేది ఒక రకమైన వాతావరణ మార్పు. దీనిని “ఎల్‌నినో సదరన్ ఆసిలేషన్” (ఈన్ఎస్వో) అని పిలుస్తారు. దీని ప్రభావంతో సెంట్రల్-ఈస్టర్న్ పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతలు మారుతాయి. అలాగే వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. ఈ ఈఎన్ఎస్వో ప్రపంచ వాతావరణాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. ఇది ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటుంది.. వెచ్చగా (ఎల్‌నినో), చల్లగా (లానినా), మామూలుగా (న్యూట్రల్) ఇవి రెండు నుంచి ఏడేండ్లల్లో మళ్లీమళ్లీ వస్తుంటాయి. ఈ నేపథ్యంలో లానినా మళ్లీ వచ్చినా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు మామూలు కంటే ఎకువగానే ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గత నెలలో చెప్పింది. లానినా అనేది ఎల్‌నినోకు వ్యతిరేక వాతావరణ ప్రభావాలను తీసుకొస్తుందని పేర్కొన్నది. ఉష్ణమండల ప్రాంతాల్లో లానినా, ఎల్‌నినో వంటివి సహజంగా జరిగే సంఘటనలని వివరించింది.