హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల అమలును ప్రారంభించి 75 ఏండ్లు గడుస్తున్నా ఆ వర్గాలు ఇంకా అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచారని మరోసారి స్పష్టమైంది. ఆర్థిక, సామాజిక వెనుకబాటులో అత్యధిక స్కోర్‌తో ఇప్పటికీ ఈ రెండు వర్గాలకు చెందిన ఉపకులాలు అత్యంత వెనుకబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 99 శాతం ఎస్టీలు, 97శాతం ఎస్సీలు, బీసీలలో 71శాతం జనాభా ఇప్పటికీ అత్యంత వెనుకబాటులో ఉన్నారని సీప్ సర్వే తేల్చిచెప్పింది. మొత్తం జనాభాలో వెనుకబాటులో ఉన్నది 67 శాతం మంది వెనుకబడిన వర్గాలేనని స్పష్టమైంది. సామాజిక, ఆర్థిక రంగాల్లో రాష్ట్రం నిర్దేశించుకున్న ఇండెక్స్ సగటు కంటే 15 పాయింట్ల మేర ఎస్సీ, ఎస్టీ ఉపకులాలు వెనుకబాటుకు గురయ్యారని సీప్ సర్వే పేర్కొంది. ఇక ఇదే సమయంలో అన్రిజర్వ్డ్ (జనరల్) క్యాటగిరీలో ఉన్న కులాలు అభివృద్ధిలో సగటును మించి మరీ అత్యంత అధిక శాతంతో అభివృద్ధి పథంలో సాగుతున్నాయని తేలింది.
42 ప్రమాణాల ఆధారంగా పాయింట్లు
సీప్ సర్వేలో ప్రజలు ఇచ్చిన సమాచారం ప్రాతిపదికగా రూపొందించిన నివేదికలో మొత్తం 242 కులాల సమాచారం ఆధారంగా ర్యాంకులు, స్కోర్లు కేటాయించారు. ఇందుకుగాను 42 ప్రమాణాలను అనుసరించారు. దీని ఆధారంగా ప్రతి కులానికి పాయింట్లు ఇచ్చిన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల వెనుకబాటు ఏ దిశలో ఉందో స్పష్టంగా వెల్లడించింది. ఈ సర్వేలో ప్రధానంగా ఎక్కువ స్కోర్ వచ్చిన కులం ఎక్కువ వెనుకబాటులో ఉన్నట్టు ర్యాంకింగ్ ఇచ్చారు. ఇందులో ఎస్సీ వర్గాలు 96శాతం స్కోర్‌తో అత్యంత వెనుకబడిన వర్గంగా, ఎస్టీలు 95 స్కోర్‌తో రెండో స్థానంలో ఉండగా, బీసీలు 8 6శాతం స్కోర్‌తో రాష్ట్ర సగటుకు చేరుకున్నారు. ఇక జనరల్ క్యాటగిరీ కులాలు మాత్రమే 31 స్కోర్‌తో అద్భుతంగా అభివృద్ధి చెందిన వర్గంగా గుర్తింపు పొందాయి.
సగటు స్కోరు 81గా నిర్ధారణ
రాష్ట్రంలో వివిధ కులాల సామాజిక, ఆర్థిక వెనుకబడిన స్థితిని అంచనా వేసేందుకు కాంపోజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్‌ను ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకుంది. ఈ సర్వేలో తెలంగాణ మొత్తం సగటు స్కోర్‌ను 81గా నిర్దేశించారు. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీలు నిర్దేశిత సగటు కంటే 15 పాయింట్లు ఎక్కువ వెనుకబాటులో ఉన్నారని నివేదిక పేర్కొంది. మొత్తం 242 కులాలలో 135 కులాలు రాష్ట్ర సగటు స్కోర్ 81 కంటే మరింత వెనుకబడి ఉన్నాయి ఈ 135 కులాలు 67శాతం జనాభాను కలిగి ఉన్నాయి. దీనినిబట్టి రాష్ట్రంలో 67శాతం మంది సగటకంటే వెనుకబడి ఉన్నట్టు తెలుస్తున్నది. బీసీల్లోని 133 కులాల్లో ఎక్కువ వెనుకబడిన కులాలు 69 కాగా, వాటి వాటా 71శాతంగా ఉంది.
మరో 64 కులాలు తక్కువ వెనుకబాటులో ఉన్నట్టు గుర్తించారు. ఎస్సీ వర్గాలకు చెందిన మొత్తం 59 కులాల్లో 41 కులాలు ఎక్కువ వెనుకబాటులో ఉన్నాయి. మరో 18 కులాలు 0.5 శాతం జనాభాతో తక్కువ వెనుకబాటు జాబితాలో ఉన్నాయి. ఇక ఎస్టీల్లో మొత్తం 32 కులాలు ఉండగా ఇందులో 25 కులాలు 99శాతంతో వెనుకబాటులో ఉన్నాయి. కేవలం 7 కులాలు మాత్రమే తక్కువ వెనుకబాటు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. జనరల్ క్యాటగిరీలో అంటే అన్ రిజర్వుడు జాబితాలోని మొత్తం 18 కులాల్లో ఒక్క కులం కూడా అత్యంత వెనుకబాటు జాబితాలో లేదని నిర్ధారణ అయింది. 12 శాతం జనాభా ఉన్న ఈ వర్గాలు రాష్ట్ర సగటు కంటే ఎంతో మెరుగైన స్థానంలో నిలిచి తమ సామాజిక, ఆర్థిక ప్రగతిని చాటుకున్నాయి.

తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి రాజకీయ, కుల సర్వేలో గిరిజనులు, దళితవర్గాలు అధిక శాతం వెనుకబాటులోనే ఉన్నారని తేలింది. ఇది కుల ఆధారిత అసమానతలను ప్రతిబింబించింది. ఎస్టీల్లోని 32 కులాల్లో 25 పూర్తిగా 99శాతంతో వెనుకబాటులో ఉండగా, ఎస్సీల్లో కూడా 59 కులాల్లో 41కులాలు 97 శాతంతో జనాభా కలిగి పూర్తి వెనుకబాటులో ఉన్నట్టు సీప్ సర్వే వెల్లడించింది. బీసీల్లోని 69 కులాలలో 71శాతం మంది అత్యంత వెనుకబాటులో ఉన్నారని స్పష్టమైంది.