హైదరాబాద్, ఆట ప్రతినిధి : ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా గేమ్స్‌కు ఈ ఏడాది చివర్లో తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో వర్గ పోరు, దీర్ఘకాలంగా వివాదాల్లో చిక్కుకున్న తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ)ను గాడిలో పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కోరింది. టీఓఏ ఓటర్ల జాబితాతో పాటు ఎన్నికల ప్రక్రియను పరిశీలించాలని, అవసరమైతే స్వతంత్ర పద్ధతిలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష రాష్ట్ర క్రీడా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది.
గతంలో జూన్ 6న రాసిన లేఖను కూడా ప్రస్తావిస్తూ దీనిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. టీఓఏ పాలనా వ్యవహారాలు, ఓటర్ల జాబితా, అర్హతలపై పలు క్రీడా సంఘాల నుంచి తమకు ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చాయని ఉష తెలిపింది. టీఓఏలో ఈ వివాదాలు చాలాకాలంగా కొనసాగుతుండటంతో రాష్ట్ర క్రీడా వర్గాల్లో అపనమ్మకం ఏర్పడిందని పేర్కొంది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ నిబంధనలకు లోబడి టీఓఏ ఓటర్ల జాబితా పరిశీలనకు, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించాలని ఐఓఏ కోరింది.