MLA Seethakka | హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. ఆ పార్టీలో రోజుకో సీఎం అభ్యర్థి పుట్టుకొస్తున్నారు. ఇప్పటికే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, మధు యాష్కీ తదితరులు తాము సీఎం రేసులో ఉన్నామని ప్రకటించుకున్నారు. అదే జాబితాలో తాజాగా మరొకరు చేరిపోయారు. సీఎం పదవిపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గురువారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చి హైకమాండ్ ఆదేశిస్తే సీఎం పదవి చేపడతానని ఆమె తన మనసులోని మాట బయటపెట్టారు. దీంతో కార్తకర్తల్లో అయోమయం నెలకొన్నది. గెలువక ముందే.. మేమంటే.. మేము సీఎంలమంటూ.. డాంబికాలకు పోయి అసలు ప్రచారాన్ని వదిలేస్తున్నారని వాపోతున్నారు.