హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆస్తి పన్ను ఎగవేతకు ఆస్కారం లేకుండా అధికారులు పక్కా సంస్కరణలు తీసుకొచ్చారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని భవనాలు, ఖాళీ స్థలాలు రిజిస్ట్రేషన్ సమయంలోనే మున్సిపల్‌శాఖ పన్నుల పరిధిలోకి వచ్చేలా పక్కాగా చర్యలు చేపట్టారు. మానవ ప్రమేయం తగ్గించి సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకత ఉండేలా సంస్కరణలు తెచ్చారు. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎవరైనా ఆస్తులు విక్రయించినా, కొనుగోలు చేసినా కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఆటోమెటిక్‌గా మున్సిపల్ రికార్డుల్లో మ్యుటేషన్ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు.
గతంలో రిజిస్ట్రేషన్ చేసినా మున్సిపల్ కార్యాలయంలో మ్యుటేషన్ చేసుకోవాల్సి వచ్చేది. అవగాహన లేక కొందరు మ్యుటేషన్ చేసుకొనే వారే కాదు. వీటన్నింటిని ఫుల్స్టాప్ పెడుతూ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేసారి, ఒకే దగ్గర చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నమోదైన ఇండ్లు, ఖాళీ స్థలం కొలతల వివరాల ప్రకారం కొత్త యజమాని పేరున పన్ను జనరేట్ చేస్తారు. ఈ విధానాన్ని మార్చి మొదటి వారంలో ప్రయోగాత్మకంగా నిర్వహించారు. అది విజయవంతం కావడంతో పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు 32 వేల ఆస్తులు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటికి ఐదు కోట్లకు పైగా పన్ను విధించారు. పన్ను జనరేట్ చేసిన సమాచారం సంబంధిత యజమాని సెల్‌ఫోన్‌కు అందుతున్నది. తద్వారా యజమానులు పన్ను పరిధిలోకి రాకుండా పోయే అవకాశాలు ఉండవు.
టీఎస్‌బీపాస్‌తో అనుసంధానం
రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతి ఇచ్చేందుకు టీఎస్‌బీపాస్ అమలు చేస్తున్నారు. టీఎస్‌బీపాస్ వెబ్‌సైట్‌తో మున్సిపల్‌శాఖ వెబ్‌సైట్‌ను అనుసంధానం చేశారు. తద్వారా అనుమతి తీసుకున్న ఇంటికి రెండేండ్ల తర్వాత ఆస్తి పన్ను పరిధిలోకి వచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. టీఎస్‌బీపాస్‌లో ఇచ్చిన కొలతల ప్రకారం పన్ను జనరేట్ అవుతుంది. అసెస్మెంట్ కాపీని యజమాని సెల్‌ఫోన్‌కు మున్సిపల్‌శాఖ పంపిస్తుంది. యజమానులు ప్రత్యేకంగా ఆస్తి పన్ను కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. ఆస్తి పన్ను పరిధిలోకి రాని ఇండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాల్సిన అవసరం మున్సిపల్ సిబ్బందికి ఉండదు. ఈ విధానం ద్వారా ఇప్పటివరకు 4000పైగా ఇండ్లకు అనుమతులిచ్చారు. ఆ సమాచారం అంతా మున్సిపల్ రికార్డుల్లో నమోదైంది.