జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 13 : బొటానికల్ గార్డెన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వృక్ష వర్గీకరణ, గిరిజన వైద్యం, బొటానికల్ గార్డెన్స్ నిర్వహణ వంటి అంశాలపై కోల్కతాలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో జడ్చర్లలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన జడ్చర్లలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ విశిష్టతను వివరిస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతరించిపోతున్న స్వదేశీ మొక్కల పెంపకంలో తెలంగాణ బొటానికల్ గార్డెన్ నిర్వహించిన పాత్రను ప్రధానంగా వివరించారు. మూడేండ్లలో బొటానికల్ గార్డెన్లో వివిధ రకాలకు చెందిన వేల మొక్కలు పెంచడంతోపాటు అడవుల విస్తరణ కోసం అటవీశాఖ అధికారులకు విత్తనాలు సరఫరా చేసిన తీరును తెలిపారు. ఔషధ మొక్కలైన విషముష్టి, పంచతులసీ, నారేపి, ఆరే ఇలా అనేక రకాల ఆర్కిడ్, వన్యజాతి మొక్కలను గార్డెన్లో పెంచుతున్నట్టు వెల్లడించారు. అంతర్జాతీయ సదస్సులో బొటానికల్ గార్డెన్ విశిష్టతను తెలియజేసే అవకాశం దక్కడంపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ, అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.