కంది, ఆగస్టు 14: డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ లిటరసీలో ఐఐటీహెచ్ ముందంజలో ఉన్నదని డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి అన్నారు. ఆల్ ఇండియా రేడియో ఆధ్వర్యంలో సోమవారం ఐఐటీహెచ్ ఆడిటోరియంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ లిటరసీపై సదస్సు నిర్వహించారు. ఈ సం దర్భంగా బీఎస్ మూర్తి మాట్లాడుతూ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో తీసుకొచ్చిన నూతన విధానాలతో దేశం ప్రతి ఒక్కరికీ విద్యాదాత, విశ్వగురుగా నిలుస్తుందని చెప్పారు. కొత్తకొత్త ఆన్లైన్ కార్యక్రమాల ఆవిర్భావానికి కొవిడ్ దోహదం చేసిందని గుర్తుచేశారు. ఐఐటీహెచ్ ఎంటెక్ కోర్సుకు సంబంధించి ఆన్లైన్లో డిజిటల్ క్లాసులు ప్రారంభించినట్టు తెలిపారు. వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న వారికి రోజూ సాయంత్రం మూడు గంటల పాటు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రెండేండ్ల ఎంటెక్ కోర్సుకు నాలుగేండ్ల వరకు అవకాశమిచ్చి డిగ్రీ పొందే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.