హైదరాబాద్, మార్చి 26(నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు చిన్నపాటి వ్యాపారాలకే పరిమితమైన హైదరాబాద్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా) ఇకపై తన వ్యాపారాన్ని విస్తరించాలని కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన హాకా దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం, ఇతర రాష్ట్రాల పరిధిలోనూ వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు ఆయా ప్రభుత్వాలతో ఎంవోయూలు కుదుర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నది. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన హాకా ఇప్పటివరకు కేవలం అంగన్వాడీలకు సరుకుల సరఫరాతో పాటు ప్రభుత్వ సంస్థలకు స్టేషనరీ సైప్లె చేయడం, కొన్నిరకాల విత్తనాలను విక్రయించడం వంటి టెండర్లకు మాత్రమే పరిమితమైంది. ఇటీవలే ప్రభుత్వం హాకా చైర్మన్‌గా మచ్చా శ్రీనివాస్‌రావును నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరమే హాకా బలోపేతంపై దృష్టి సారించారు.
హాకా ప్రస్తుత వార్షిక టర్నోవర్ రూ.250 కోట్లకు మించడం లేదు. ఈ నేపథ్యంలో హాకా టర్నోవర్‌ను రూ.35 వేల కోట్లకు పెంచాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్త వ్యాపార అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తక్కువ కమీషన్‌తో ఎక్కువ వ్యాపారాలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నది. రాష్ట్రంలోనూ వివిధ వ్యాపారాలు చేయాలని సంస్థ
నిర్ణయించింది.
హాకాను గాడిలో పెట్టాలని నిర్ణయించాం. ప్రస్తుతమున్న టర్నోవర్‌ను రూ.35 వేల కోట్లకు పెంచాలన్న లక్ష్యం పెట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వ, ఇతర రాష్ర్టాలు నిర్వహించే టెండర్లలో పాల్గొంటాం.
– మచ్చా శ్రీనివాసరావు, చైర్మన్, హాకా