హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ వరాల మల్లయ్య ఆత్మహత్యపై మేజిస్ట్రేట్ విచారణ నివేదికతోపాటు ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని హోం, జైళ్ల శాఖల అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు జస్టిస్ టీ మాధవీదేవి నోటీసులు జారీ చేశారు. జైలులో తన భర్తతో మరుగుదొడ్లు శుభ్రం చేయించి అవమానించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మల్లయ్య భార్య హిమ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. భర్తను కోల్పోవడం వల్ల ఇద్దరు చిన్నారులతో తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నానని ఆమె పిటిషన్లో పేర్కొంటూ.. తమకు రూ.50 లక్షల పరిహారం మంజూరు చేయాలని కోరారు.
పిటిషనర్ ఆరోపణలపై జైళ్లశాఖ ఐజీ స్వతంత్రంగా ఎందుకు విచారణ చేపట్టలేదని జస్టిస్ మాధవీదేవి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. మల్లయ్య ఆత్మహత్య వెనుక జైలు అధికారుల తప్పేమీ లేకపోతే విచారణకు ఎందుకు అభ్యంతరం వ్యక్తమవుతున్నదని నిలదీశారు. మల్లయ్య ఆత్మహత్యపై మేజిస్ట్రేట్ నివేదికతోపాటు ఈ వ్యవహారంలో ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హోం, జైళ్ల శాఖల అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.