హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : సన్నబియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతుంటే నియంత్రించాల్సిన రేవంత్‌రెడ్డి సర్కార్ నేలచూపులు చూస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నిత్యావసరాల ధరలను అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని సోమవారం ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. బియ్యం, నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతుంటే పౌరసరఫరాల శాఖ మొద్దునిద్ర నటిస్తున్నదని దుయ్యబట్టారు.
నాలుగు నెలల్లో సన్నబియ్యం ధరలు 25% పెరుగడం కనిపించడం లేదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘రికార్డుస్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని సర్కార్ గొప్పలు చెప్పుకొంటున్నది. మరి, ఉత్పత్తి పెరిగినప్పుడు బియ్యం ధరలు ఎందుకు చుక్కలను అంటుతున్నాయి? మీరు ఇస్తున్న సన్నబియ్యం పథకం సఫలమైతే బియ్యం ధరలు అదుపు తప్పుతున్నాయెందుకు ?’అని హరీశ్‌రావు నిలదీశారు.