హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): పర్యాటకశాఖ ఆధీనంలోని హరిత హోటళ్లను బార్ అండ్ రెస్టారెంట్లుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త టూరిజం పాలసీలో పర్యాటకులకు మద్యాన్ని సరఫరా చేసేందుకు సమాయత్తమవుతున్నది. పర్యాటకశాఖ ఆలోచనతో మరిన్ని సమస్యలు తప్పవని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అమ్మకాల పెంపే పరమావధి
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సందర్శనకు వెళ్లే పర్యాటకుల వసతి కోసం బీఆర్ఎస్ హయాంలో హరిత హోటళ్లను నిర్మించింది. కానీ, వాటిని బార్ అండ్ రెస్టారెంట్లుగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే గోలొండ సమీపంలోని తారామతి బరాదరి, బేగంపేట టూరిజం ప్లాజాలో బార్అండ్ రెస్టారెంట్ సేవలను ప్రారంభించింది. ఈగలపెంట, సోమశిల, మన్ననూరు, మేడారం, తాడ్వా యి, బొగత తదితర ప్రాంతాల్లోని హరిత హోటళ్లలోనూ మద్యం సరఫరా కోసం ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది.
లీజు రూపంలో అనుచరులకు లబ్ధి?
హరిత హోటళ్లకు ఆశించిన స్థాయిలో డిమాండ్ ఉండటం లేదనేది ప్రభుత్వం చెప్తున్నది. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే, నిర్వహణ నష్టాల నుంచి బయటపడటంతోపాటు అదనంగా ఆదాయం సమకూరుతుందని అధికారులు వెల్లడించారు. కానీ ప్రభుత్వంలోని కీలక హోదాల్లో ఉన్న నేతలు హోటళ్లను అనుకూలమైన వ్యక్తులకు, అనుచరులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తున్నది. కొందరికి లబ్ధి కలిగించేందుకే కొందరు పెద్దలు ఈ ఎత్తుగడ వేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.