MLC Bye Election : ‘ఖమ్మం – నల్లగొండ – వరంగల్’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది.
ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లను జూన్ 5న లెక్కించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆ నియోజకవర్గానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు.
బరిలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాకేశ్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీపడుతున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రాడ్యుయేట్స్ ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం అధికారులు మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని 4,63,839 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.