హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు శనివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఈ నెల 27న (సోమవారం) ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, జూన్ 5న నల్లగొండలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. పోలింగ్ సిబ్బందికి ఆదివారం ఎన్నికల సామగ్రిని అందజేసి, పోలింగ్ కేంద్రాలకు పంపనున్నారు. ఈ ఉప ఎన్నికలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 2,88,189 మంది పురుషులు, 1,75,645 మంది మహిళలు, ఐదుగురు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తంగా 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 283 పోలింగ్ కేంద్రాల్లో 800 మంది కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. ఈ ఉప ఎన్నిక కోసం 3 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 52 మంది అభ్యర్థులు పోటీపడుతున్న ఈ ఎన్నికను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించేందుకు జంబో సైజు బ్యాలెట్ బాక్సులను ఉపయోగిస్తున్నారు.
ఈ ఎన్నికలో ‘నోటా’ ఆప్షన్ ఉండదు. ప్రతి ఓటరు ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. అయితే, మొదటి ప్రాధాన్య ఓటు ఎవరికీ వేయకుండా మిగిలిన ప్రాధాన్య ఓట్లను వేస్తే ఆ ఓటు చెల్లదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఇచ్చే వయొలెట్ (ఊదా రంగు) స్కెచ్ పెన్నునే వినియోగించాలని, లేకపోతే ఆ ఓటు చెల్లదని అధికారులు తెలిపారు.